
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇవాళ ఉదయం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు. విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని..ఆ 10 ఫోన్ల IMEI నెంబర్లను అమిత్ అరోరా 32 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు. అయితే 2021 సెప్టెంబరు 1వ తేదీన ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు.
ఆధారాలు దొరకకుండా 153 ఫోన్లు ధ్వంసం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది. అమిత్ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన 153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.
ఎవరీ అమిత్ అరోరా ?
గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.
సీబీఐ ఛార్జ్షీట్ లో ఏముంది ?
మరోవైపు ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరపగా.. తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.