కవిత బెయిల్ పిటిషన్​పై..విచారణ వాయిదా

కవిత బెయిల్ పిటిషన్​పై..విచారణ వాయిదా
  •    ఏప్రిల్ 4న వింటామన్న రౌస్ అవెన్యూ కోర్టు
  •     ఆలోగా ఈడీ కౌంటర్​కు​ రిజాయిండర్​ దాఖలు చేయాలని ఆదేశం
  •     కవితకు హోం ఫుడ్, జపమాల, బుక్స్ కు అనుమతించిన జడ్జి
  •     తీహార్ జైలు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్​కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసి బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు బెయిల్ పిటిషన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్​కు రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరఫు అడ్వొకేట్​ని ఆదేశించింది. అలాగే, కవిత తరపున అడ్వొకేట్​ రానా విజ్ఞప్తి మేరకు.. తీహార్ జైల్​లో ఆమెకు హోం ఫుడ్, జపమాల, బుక్స్, ఒక జత బూట్లు (లేస్ లేని), మెడిటేషన్​కు అనుమతిచ్చేలా జైలు సిబ్బందికి ఆదేశాలిస్తామని స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా పేర్కొన్నారు. గత నెల 15న హైదరాబాద్​లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. మరుసటి రోజు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. రెండు దశలుగా ట్రయల్ కోర్టు కవితకు విధించిన 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో.. గత నెల 26న ఆమెను మరోసారి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రభావవంతమైన మహిళ అయినందున ఆమెకు బెయిల్ ఇస్తే, సాక్ష్యాలను తారు మారు చేసే ప్రమాదం ఉందని ఈడీ కోర్టుకు నివేదించింది.

అందువల్ల కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించాలని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవితకు ఈ నెల 9 వరకు జ్యుడీషియల్​ రిమాండ్​ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సందర్భంలో.. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని గత నెల 26 న కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్ పైనా విచారణ చేపట్టాలని ఈ పిటిషన్ ద్వారా స్పెషల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్​పై సోమవారం రౌస్ ఎవెన్యూ లోని సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్, కవిత తరపు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ, అడ్వొకేట్ నతీశ్ రానా వాదనలు వినిపించారు.

ఈడీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు: సింఘ్వీ

ఈడీ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీగా కాకుండా, పీడించే ఏజెన్సీగా వ్యవహరిస్తున్నదని సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు కొనసాగించారు. ఈ కేసు విచారణలో ఈడీ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ దర్యాప్తు పూర్తిగా ప్రేరేపితంగా ఉన్నదని ఆరోపించారు. అరెస్ట్ చేస్తాం.. లేదంటే టామ్​ అండ్ జెర్రీ (పిల్లి, ఎలుక) ఆటలాడుతాం అన్నట్టుగా ఈడీ వ్యవహారం ఉన్నదని తెలిపారు. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ మొత్తం 10 స్టేట్​మెంట్లు నమోదు చేసిందని, ఇందులో 9 స్టేట్​మెంట్లలో కవిత పేరు ప్రస్తావించలేదని చెప్పారు. అయితే, 10వ వాంగ్మూలంలో కవిత పేరు చెప్పినా.. కొద్ది నెలల తర్వాత ఆ స్టేట్​మెంట్లను పిళ్లై ఉపసంహరించుకున్నట్టు వివరించారు. 2022లో 18 నెలల క్రితం ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు. కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీకి అధికారం ఉన్నదని, అయితే, ఆ అరెస్ట్ కు ఆవశ్యకతను చూపించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. తర్వాత మరిన్ని అనుబంధ చార్జ్ షీట్లు దాఖలు చేసినా ఎక్కడా కవితను నిందితురాలిగా చూపలేదని కోర్టుకు నివేదించారు. పలు సమన్ల ద్వారా కవితను వేధించినా ఆమె దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని తెలిపారు. ఈడీ కోర్టు, దేశం, రాజ్యాంగానికి అతీతంగా ఓ సూపర్​ సామ్రాజ్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. సుప్రీంకోర్టు ముందు కవితపై ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చిన ఈడీ అధికారులు.. అందుకు భిన్నంగా ఆమె ను అరెస్ట్ చేశారని చెప్పారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ గత నెల 15న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన రోజే ఆమెను అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇది హత్య, ఉగ్రవాదానికి సంబంధించిన కేసు కాదని పేర్కొన్నారు. అంతకు ముందు తీహార్ జైల్లో కవితకు హోం ఫుడ్, పుస్తకాలు, స్పోర్ట్స్ షూలు, జపమాలకు అనుమతించాలని కవిత తరపున న్యాయవాది నితీశ్​ రానా కోర్టును కోరారు.

మెడిటేషన్ కోసం జపమాల అనుమతించండి

తీహార్ జైళ్లో మెడిటేషన్ చేసుకునేందుకు కవితకు జపమాలతో పాటు లేసులు లేని బూట్లు, పుస్తకాలు, ప్రతి రోజు న్యూస్ పేపర్లు అనుమతించాలని రౌస్ ఎవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆమె కోరిన ‘కుకింగ్‌ ఆఫ్‌ బుక్స్‌, 365 సుడోకు, జయ గోష, మురకమి నార్వింగ్‌ వుడ్‌, ది ఆర్‌ఎస్‌ఎస్‌ రోడ్‌ మ్యాప్స్‌ ఫర్‌ 21స్ట్‌ సెంచురీ, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్‌ యంగ్‌ గర్ల్‌, లివింగ్‌ ఇన్‌ ద లైట్‌ అండ్‌ పేపర్‌ క్లబ్‌, నోట్‌ బుక్స్‌’ను అనుమతించాలని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఇంటి నుంచి ఆహారం, పుస్తకాలు, పరుపులు, స్లిప్పర్స్‌, దుప్పట్లు తెచ్చునేందుకు, ఆభరణాలు ధరించేందుకు అనుమతించాలని మరోసారి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

దేనిపై వాదిస్తున్నారో క్లారిటీ ఇవ్వండి: ఈడీ అడ్వొకేట్

అభిషేక్ మనుసింఘ్వీ వాదనలపై ఈడీ తరపు అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ అభ్యంతరం తెలిపారు. సింఘ్వీ వ్యవహారం విచిత్రంగా ఉన్నదన్నారు. కవిత కు మధ్యంతర బెయిల్ పై వాదిస్తున్నారా? రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తున్నారా? అనేది స్పష్టం చేయాలని కోరారు. మధ్యంతర బెయిల్ పై కవిత దాఖలు చేసిన పిటిషన్ కు ఈడీ తరఫున కౌంటర్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ ఫైనల్ బెయిల్ కు వాదనలు వినిపించాలని, లేదా మధ్యంతర బెయిల్ కోసం మాత్రమే పరిమితం కావాలని సూచించారు. అయితే, ఈ రెండింటిపై వాదించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. దాదాపు గంటన్నర పాటు ఇరువైపు వాదనలు విన్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా.. మరో రోజు వాదనలు వినిపించేందుకు సిద్ధమా? అని కవిత తరపు అడ్వొకేట్ సింఘ్వీని అడిగారు. ఇందుకు ఇరు వైపుల న్యాయవాదులు అంగీకరించడంతో.. తదుపరి వాదనలు ఏప్రిల్ 4 వ తేదీన లంచ్ తర్వాత(మధ్యాహ్నం 2:30) కు వింటామని 
జడ్జి వెల్లడించారు.