బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు... కవిత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు...   కవిత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ సోమవారం రోజున తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.  ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు జడ్జి కావేరి భవేజ తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వింటామని తెలిపారు.  కవిత తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు. 

తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కవిత కుమారుడిని చూసుకునేందుకు కుటుంబంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది.  కవితకు  బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని వాదించారు. 

లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని, అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, ఫోన్లలో డేటా డిలీట్ చేసి ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, మహిళగా, చట్టసభ సభ్యురాలిగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

ALSO READ :- RCB: 16 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణ‌కు తెర‌.. ఆర్‌సీబీ మహిళా క్రికెటర్‌కు సన్మానం