RCB: 16 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణ‌కు తెర‌.. ఆర్‌సీబీ మహిళా క్రికెటర్‌కు సన్మానం

RCB: 16 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణ‌కు తెర‌.. ఆర్‌సీబీ మహిళా క్రికెటర్‌కు సన్మానం

మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్(డబ్ల్యూపీఎల్ 2024) రెండో సీజ‌న్‌ విశ్వ విజేతగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో స్మృతి మంధాన సేన.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫ్రాంచైజీ 16 ఏండ్ల‌ ట్రోఫీ నిరీక్షణకు తెర‌దించింది. అయితే, ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 4 వికెట్లతో రాణించి ఆర్‌సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సొంత గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

శ్రేయాంక పాటిల్ స్వస్థలం కర్ణాటక, కలబురగి జిల్లాలోని జేవర్గి తాలూకాలోని కొలకురే గ్రామం. ఇటీవల ఆమె తన స్వగ్రామాన్ని సందర్శించారు. ఆర్‌సీబీ మహిళా జట్టు డబ్ల్యూపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం తొలిసారి స్వగ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కారులో ఊరేగిస్తూ పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కలబురగి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు.

ఎమర్జింగ్ ప్లేయ‌ర్ ఆఫ్ అవార్డు 

డబ్ల్యూపీఎల్ టోర్నీలో శ్రేయాంక పాటిల్ అద్భుతంగా రాణించింది. చివరి ఓవర్లలోనూ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేసింది. మొత్తంగా 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకుని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. దాంతో, ‘ఎమర్జింగ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది  సీజ‌న్’  అవార్డును ఎగరేసుకుపోయింది.

ALSO READ :- Kaia Arua: 33 ఏళ్లకే ప్రాణాలు వదిలిన మహిళా క్రికెటర్