- నిన్న బీటీ బ్యాచే మిగిలిందని విమర్శలు
- మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాల బాగోతంపై ఫైర్
- కారు పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై బాణం ఎక్కు పెట్టారు. కారు పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. హరీశ్ రావు టార్గెట్ గా విమర్శలు చేయడం ప్రారంభించిన కవిత కేటీఆర్ ను కూడా విమర్శిస్తుండటం గమనార్హం. నిన్న మేడ్చల్ జిల్లాలో పర్యటించిన కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావుతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డిపైనే తనదైన శైలిలో అటాక్ చేశారు. మల్లారెడ్డి కబ్జాల బాగోతాన్ని మరోమారు చదివేశారు.
పాలమ్మన..పూలమ్మిన అంటూ భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారంటూ విమర్శలు చేశారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందన అవినీతి, కబ్జాల బాగోతాన్ని కడిగి పారేశారు. కుత్బుల్లాపూర్ కాదు కబ్జాలాపూర్ అంటూ సెటైర్ వేశారు. ఉద్యమకారుడు శంభీపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరడగుల బుల్లెట్ హరీష్ రావు మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక హాస్పిటల్ కట్టించలేదని ఫైర్ అయ్యారు. పనిలో పనిగా కేటీఆర్ పైనే అదే స్థాయిలో విమర్శలు చేశారు. డిప్యాక్టో సీఎం కేటీఆర్ అంటూ కామెంట్ చేశారు...
ఇవాళ విజయ్ దివస్ పై ట్వీట్..
కవిత విమర్శల ధాటి ఆగలేదు. ఇవాళ ట్విట్టర్ వేదికగా అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు, విజయ్ దివస్ లు.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు.. అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇవాళ ఉదయం డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదంటూ తెలంగాణ ఏర్పాటుపై మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ ట్వీట్ చేశారు.
అధికారం కోల్పోయాక
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 9, 2025
దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు
ఇది ఉద్యమాల గడ్డ
ప్రజలు అన్నీ గమనిస్తున్నరు !!
డిసెంబర్ 9ని విజయ్ దివస్ గా పేర్కొన్నారు. నవంబర్ 29ని దీక్షా దివస్ గా బీఆర్ఎస్ ఉత్సవాలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలపై కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ విజయ్ దివస్ గా పేర్కొంటూ ట్వీట్ చేసిన కేటీఆర్ దుబాయ్ వెళ్లడం గమనార్హం. దీనిపై కారు పార్టీ ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించలేదు.

