నాపై కక్షగట్టి వేధిస్తున్నారు.. అన్నపై కవిత గుర్రు.!

నాపై కక్షగట్టి వేధిస్తున్నారు.. అన్నపై కవిత గుర్రు.!

బీఆర్ఎస్ లో మరోసారి  ఎమ్మెల్సీ కవిత లేఖ కాక రేపుతోంది.  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TGBKS) అధ్యక్షురాలిగా కవితను తొలగించి  కొప్పల ఈశ్వర్ ను  నియమించడంపై  ప్రశ్నిస్తూ  కవిత  లేఖ రాశారు. ఇపుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో  హాట్ టాపిక్ గా మారింది.

 తాను యూఎస్ టూర్ లో ఉన్న టైంలో టీజీబీకేఎస్ మీటింగ్ పెట్టారన్న కవిత.. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో టీజీబీకేఎస్ అధ్యక్షుడి ఎన్నిక జరిగిందన్నారు. తనను తొలగించి  కార్మికుల ఐక్యత దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలతో కేసీఆర్ కు లేఖ రాస్తే లీక్ చేశారు ..లేఖ లీక్ చేసి తనపై కుట్ర చేస్తున్నదెవరో బయటపెట్టాలని కోరా..  పార్టీ వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కక్షగట్టారని విమర్శించారు కవిత.  లేఖ లీక్ చేసిన కుట్రదారులే తనను వేధింపులకు గురిచేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. రాజకీయ కారణాలతోనే టీజీబీకేఎస్ ఎన్నిక జరిగిందన్నారు కవిత.

 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్​) గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న  కవితను  ఆ స్థానం నుంచి కేటీఆర్ తప్పించారు. ఆగస్టు 20న బుధవారం తెలంగాణభవన్​లో నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్​ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ను టీబీజీకేఎస్ ఇన్​చార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. 

తాజాగా కేటీఆర్ కనుసన్నల్లోనే ఆయనను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కవిత అమెరికాకు వెళ్లిన సమయంలో అదును చూసుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కవిత వర్గం నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఏడాదిగా గౌరవాధ్యక్షులను ఎన్నుకోలేదని, ఆ స్థానం ఖాళీగా ఉండడం వల్లే కొప్పుల ఈశ్వర్​ను ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ ప్రతినిధులు చెబుతున్నారు.

చిన్నగా అన్నింటికీ దూరం..

కవితను ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నయ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. చిలికిచినికి గాలివానలా ముదిరింది. ఆ తర్వాత నేరుగా ఆమె తన అన్న కేటీఆర్​ను టార్గెట్ చేసుకుంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేశారంటూ బాంబు పేల్చారు. అంతేకాదు.. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై కుట్రలు పన్నారని ఆరోపణలు గుప్పించారు. 

అది మొదలు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మాట్లాడుకున్నదీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్​ భారీగా పెరిగిందన్నది రాఖీ పండగతో స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను బీఆర్​ఎస్​ పార్టీకి దూరం చేసే కుట్రలకు కేటీఆర్​ పాల్పడుతున్నారంటూ కవిత వర్గం నేతలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి, ఇప్పుడైనా కేసీఆర్​ కలగజేసుకొని వివాదానికి చెక్​ పెడతారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.