కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు ఎవ్వరు బాగుపడలే

కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు ఎవ్వరు బాగుపడలే

కామారెడ్డి, వెలుగు: ‘కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు  బాగుపడినట్లు చరిత్రలో  లేదు. బాగుపడే ప్రసక్తే లేదు. కేసీఆర్, టీఆర్​ఎస్, గులాబీ కండువాతో చాలెంజ్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలె. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కేంద్రంతో ఇప్పుడే పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎనుకముందు అయితదేమోనని సీఎం ఏడెనిమిదేండ్లు ఓపిక పట్టిన్రు. ఆయన ఓపికను, సహనాన్ని, మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు.. ఎందుకంటే కేసీఆర్​తో పెట్టుకున్నోళ్లు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు” అని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. గురువారం కామారెడ్డిలో ఆ జిల్లా టీఆర్​ఎస్​ ప్రెసిడెంట్‌గా ఎం.కె.ముజీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముఖ్య అతిథిగా కవిత హాజరై మాట్లాడారు. తాము న్యాయంగా ఉంటామని, 24 గంటలు ప్రజలతో కలిసి పని చేస్తామని, డిస్టర్బ్ చేస్తే మాత్రం ఢిల్లీ దాకా వచ్చి మీ సంగతి చూస్తామని బీజేపీని హెచ్చరించారు. తాము రైతులకు అన్నం పెడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ సున్నం పెడుతున్నారని విమర్శించారు. 

బీజేపీ లీడర్లను రానివ్వొద్దు: మంత్రి వేముల
‘చాలా రోజులు ఒపిక పట్టాం.. ఇక ఒపిక పట్టం.. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే టీఆర్​ఎస్ పార్టీ వాళ్లం పది మాటలతో సమాధానం చెబుతాం’ అని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.  ఏమీ చేయకుండానే బీజేపీ అన్ని చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఎంపీ బీబీ పాటిల్‌‌‌‌ అన్నారు. ఎమ్మెల్యేలు హన్మంతు షిండే,  జాజాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.