
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాలకు పాల్పడుతున్నారన్న కారణంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు కవితను పార్టీ నుంచి స్పసెండ్ చేశారు. పార్టీ నుంచి బహిష్కరించిన తెల్లారే కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కవిత ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్తో కవిత బంధం ముగియడంతో ఆమె భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన కవిత కొత్త పార్టీ పెడతారా..? లేదా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అవుతారా..? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బుధవారం (సెప్టెంబర్ 3) కవిత స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. తనకు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు.
సన్నిహితులు, మేధావులు, జాగృతి కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు కవిత. నిజాయితీ నిరూపించుకునేందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేసి తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు కవిత. వాళ్లిద్దరి కుట్రలను గ్రహించకపోతే.. పార్టీకి నష్టమని కేటీఆర్‌కు సూచించారు. వాళ్లిద్దరిని దూరం పెట్టి పార్టీని, నాన్నను కాపాడాలని వ్యాఖ్యానించారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు కవిత.
ALSO READ : ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా.. ఉంటే ముందుంటా.. కవితకు సీఎం రేవంత్ కౌంటర్
రేవంత్, హరీశ్ రావు ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తనపై కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. ఒకే ఫ్లైట్‌లో హరీశ్‌తో వెళ్లారో లేదో రేవంత్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందన్నారు కవిత. హరీశ్ రావు సీఎం కాళ్లు మొక్కి సరెండర్ అయ్యారని.. హరీశ్, రేవంత్ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందన్నారు. వాళ్లిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందన్నారు కవిత. సంతోష్ వల్ల రామన్నకు చెడ్డ పేరు వస్తుందన్నారు.