ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా.. ఉంటే ముందుంటా.. కవితకు సీఎం రేవంత్ కౌంటర్

ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా.. ఉంటే ముందుంటా.. కవితకు సీఎం రేవంత్ కౌంటర్

మహబూబ్ నగర్: కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆ చెత్త గాళ్ల వెనుక నేనెందుకుంటా.. ఉంటే ముందుంటా.. నాకు అంత టైమ్ లేదు.. మీ పంచాయతీలోకి నన్ను లాగకండి’’ అంటూ కౌంటరిచ్చారు సీఎం రేవంత్. పాలమూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మూసాపేట మండలం వేములపల్లిలో ఫార్మా కంపెనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పంచాయతీలోకి తనను లాగాలని చూస్తు్న్నరని, కవిత, కేటీఆర్, హరీష్.. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతో రోడ్డున పడుతున్నారని.. వాళ్ల వెనకాల తానున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడో ప్రజలు బండకేసి కొట్టారని, ఇన్నాళ్లూ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నారని బీఆర్ఎస్ ఇంటి పోరుపై రేవంత్ స్పందించారు. గతంలో ఎవరినీ ఎదగనీయని వాళ్లు ఇప్పుడు వాళ్లలో వాళ్లే పంచాయతీ పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్​ సస్పెన్షన్ వేటు వేసిన పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌‌కుమార్‌‌, టి.రవీందర్‌‌ రావు పేరిట పార్టీ అధిష్టానం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ALSO READ : సంతోష్ రావు దోస్త్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.. రూ.750 కోట్లతో వెంచర్ వేశాడు : కవిత

‘‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్​ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, కవితపై పార్టీ సస్పెన్షన్​ వేటు ఇలా వేసిందో లేదో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్‌‌ పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫొటోలను పార్టీ నేతలు తొలగించారు.