పంచాంగం ప్రకారం .. తెలుగువారు 2025 లో వచ్చిన విశ్వావశునామ సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి, 2026లో వచ్చే పరాభవ నామ సంవత్సరం గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే టైమ్ వచ్చేసింది. కొత్త సంవత్సరం అంటే కేవలం ఉగాది పచ్చడి తినడం .. దేవాలయాలను దర్శించడం ఎంత ముఖ్యమని భావిస్తామో..మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కొన్ని మనీ రూల్స్ పాటించాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. పాత తప్పులను పక్కనపెట్టి, సంపదను పెంచుకోవడానికి సరికొత్త ప్లాన్స్‌తో రెడీ అవ్వాలి. ఈ ఉగాది నుంచి ఈ43 గోల్డెన్ మనీ రూల్స్ ను కచ్చితంగా ఫాలో అయితే బతికినంత కాలం హ్యాపీగా బతకొచ్చని మనీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. . !
- 1. వీలైనంత డబ్బు దాచుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాము.. ఎక్కువుగా ఉన్నాయని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకండి.సంపాదించే సమయంలో .. చేతిలో డబ్బులు లేకపోతే వచ్చే టెన్షన్ కంటే... పొదుపు చేయడం చాలా సులభమని గుర్తించండి. వయస్సు మీరిన తరువాత.. సంపాదించలేని స్థితిలో ఉన్నప్పుడు.. ఆరోగ్యం సహకరించకపోతే .. అప్పుడు ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని తెలుసుకోండి
- 2. ఎప్పుడూ కాస్త ఎమర్జెన్సీ ఫండ్ చేతిలో ఉంచుకోండి. ఇతరులతో పోటీ పడి ఖర్చు చేయకండి. కష్టకాలంలో ఈ డబ్బే మిమ్మల్ని ఆదుకుంటుంది.
- 3. మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే, గొప్పలు పోకండి. .. ఏదో బతకడానికి సరిపోతుందిలే... అని సింపుల్‌గా చెప్పేయండి.
- 4. పొగడ్తలను త్వరగా నమ్మేయకండి. విమర్శలను మరీ సీరియస్‌గా తీసుకోకండి. దృష్టి అంతా సంపాదన.. ఖర్చులు.. పొదుపుపై పెట్టండి.
- 5. బహుమతులు ఇవ్వడం, మనుషులను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఇలాంటి సోషల్ స్కిల్స్ ఎప్పటికీ పాతబడవు.
- 6. ప్రాణ స్నేహితులతో కలిసి ఎప్పుడూ వ్యాపారం చేయకండి. డబ్బు మనుషులను మార్చేస్తుంది, స్నేహాలు రాత్రికి రాత్రే ముగిసిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం.. మాట.. మంచితనంజజ కంటే డబ్బు విలువైనది.
- 7. ఇతరుల సక్సెస్ చూసి అసూయ పడకండి. మీ లైఫ్‌ని మీ స్పీడ్‌లో బతకండి. ఉన్నదానితో సంతృప్తి పడితేనే నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. ఉన్నదానిలోనే సేవింగ్స్ కు ప్లాన్ చేసుకోండి.
- 8. బయటి ఫుడ్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ తగ్గించండి. డబ్బు ఖర్చవుతుంది.. ఆరోగ్యం పాడవుతుంది.. ఆస్పత్రులకు వేలకు వేలు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి.
- 9. వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినండి. బయట కొంటే ఖర్చు ఎక్కువ, పైగా అందులో ఏం కలుపుతారో మనకు తెలియదు.
- 10. రోజంతా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం ఆపేయండి. ఇతరుల ఫేక్, పర్ఫెక్ట్ లైఫ్‌ని చూడటం మానేసి, మీ రియల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి. ఖాళీ సమయాల్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎలా డబ్బు సంపాదించాలో ఆలోచించండి.
- 11. సొంతిల్లు ఉంటే..ఇప్పుడే అమ్మకండి. లేకపోతే.. కొనడానికి కంగారు పడకండి. ప్రస్తుతం ప్రాపర్టీ రేట్లు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. పూర్వీకుల ఆస్తిని వృద్ది చేయడానికి ప్రయత్నించండి. వివాదాల ఆస్తిని త్వరగా వదిలించుకోండి.. దానితో మీకు నచ్చిన ప్రదేశంలో.. అనుకూలంగా ఉన్నచోట ఎలాంటి గొడవలు లేని ఆస్తిని కొనుగోలు చేయండి. గొడవల్లో ఉన్న ఆస్తికోసం పాకులాడేకంటే.. దానిని త్వరగా వదిలించుకొని మరో చోట ఏర్పాటు చేసుకోవడం మంచిదని గుర్తించండి..
- 12. మీకు పూర్తి నమ్మకం, సరైన ప్లాన్ లేకుండా బిజినెస్ మొదలుపెట్టకండి. సగం సగం నమ్మకంతో దిగితే పూర్తిగా నష్టపోతారు.
- 13. క్లాస్ రీయూనియన్స్, బిల్లులు పంచుకునే పార్టీలకి వెళ్లాల్సిన అవసరం లేదు. అవి మీ జేబుకు చిల్లు పెడతాయి, మీ ఎనర్జీని లాగేస్తాయి.
- 14. 40 ఏళ్ల తర్వాత, బ్యాకప్ ప్లాన్ లేకుండా ఉన్న ఉద్యోగాన్ని సడెన్‌గా వదిలేయకండి. చేతిలో మరో జాబ్ ఉంటే తప్ప రిస్క్ చేయకండి.
- 15. ఇష్టమొచ్చినట్టు అప్పులు చేయకండి, గ్యాంబ్లింగ్ (జూదం) జోలికి వెళ్లకండి. డబ్బు వ్యవహారాలను బుర్రతో ఆలోచించాలి కానీ... ఎమోషనల్‌గా కాదు.
- 16. మీ ముందు ఎవరైనా ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే, వాళ్లతో శృతి కలపకండి. జస్ట్ నవ్వి ఊరుకోండి, విన్నట్టు నటించి అక్కడినుండి పక్కకు తప్పుకోవడం చాలా స్మార్ట్ పని.
- 17. ఎప్పుడూ కొత్త వాళ్లని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది మంచి అవకాశం కాదు, అక్కడ ఏదో తేడా ఉందని అర్థం చేసుకోండి.
- 18. అనవసరమైన పరిచయాలు తగ్గించుకోండి. తిండికి, పార్టీలకే వచ్చే ఫ్రెండ్స్‌ని ముందుగానే వదిలించుకోండి. వాళ్ల వల్ల మీ సమయం, డబ్బు రెండూ వేస్ట్.
- 19. ఎవరైనా ఒక మాట అడిగితే, పది మాటలు చెప్పే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. తక్కువ మాట్లాడటమే ఎప్పటికీ మంచిదని గుర్తించండి.
- 20. మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు, మీరు పోషించగలిగే స్తోమత కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకండి. లేదంటే పిల్లల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
- 21. ఆఫీస్ టెన్షన్స్ ఆఫీస్‌లోనే వదిలేయండి. ఇంటికి వచ్చాక, మీ కుటుంబంతోనే గడపండి.
- 22. ఒంట్లో నలతగా ఉంటే, కాసేపు నిద్రపోండి. మనసు బాగోలేనప్పుడు, మంచి పుస్తకం చదవండి.
- 23. విపరీతమైన ప్రెషర్ ఉండే ఎక్కువ జీతం జాబ్ కంటే, ప్రశాంతంగా ఉండే కొంచెం తక్కువ జీతం జాబ్ ఎంతో నయం. టెన్షన్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ, పైగా సంపాదించింది మీ దగ్గరే ఉంటుంది.
- 24. పార్టీల్లో అందరికంటే ఎక్కువ తాగాలని పోటీ పడకండి. మరుసటి రోజు తలనొప్పి భరించాల్సింది మీరే, వాళ్లు కాదు.
- 25. ఉన్న ఉద్యోగాన్ని చేసుకుంటూనే, పక్కన మెల్లిగా ఏదైనా సైడ్ ఇన్‌కమ్ పెంచుకోండి. కానీ దానికోసం ఉన్న మెయిన్ జాబ్‌ని వదిలేయకండి. ముందు స్థిరత్వం ముఖ్యం.
- 26. ఆఫర్‌లో తక్కువకి వస్తుందని ఆన్‌లైన్‌లో గుట్టలు గుట్టలుగా కొనకండి. నిజంగా అవసరమైనవే కొనండి. వాడని వస్తువులన్నీ ఇంట్లో ఓ మూల పడి ఉన్నవి కూడా మీ డబ్బతో కొన్నవే కదా..!
- 27. ఆఫీస్ కొలీగ్స్‌తో మరీ ఓపెన్ అయిపోకండి. మీరు అనుకునేది 30 శాతమే చెప్పండి, మిగతా 70 శాతం మీలోనే ఉంచుకోండి.
- 28. మీ పనులు మీరే చేసుకోగలిగితే, ఎవరిపైనా ఆధారపడకండి. మీరు మీ చేతులతో సేవ్ చేసే ప్రతి రూపాయీ మీ జేబులో ఉన్నట్టే.
- 29. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన రెస్టారెంట్లతో జనాల్ని ఇంప్రెస్ చేయడం ఆపేయండి. నిజమైన క్లాస్ అంటే పైన కనిపించేది కాదు. మనం ఎంత పొదుపు చేశామా అనేది ముఖ్యమని గుర్తించండి..
- 30. చుట్టాలతో, ఇరుగుపొరుగు వాళ్లతో పోల్చుకోకండి. ఎవరి లైఫ్ వాళ్లది. గాసిప్స్ వినబడినా, ఒక చెవితో విని మరో చెవితో వదిలేయండి.
- 31. ఎప్పుడైనా పనికొచ్చే ఒక ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోండి. కష్టకాలం రాకముందే రెడీగా ఉండండి. స్కిల్స్ ఉంటే ఎప్పుడూ ఒక ఆప్షన్ ఉంటుంది.
- 32. స్తోమత లేనప్పుడు, దాతృత్వం ప్రదర్శించకండి. ఇతరుల ముందు గొప్పల కోసం మీరే నష్టపోతారు.
- 33. ఇతరుల లోన్లకు ఎప్పుడూ గ్యారంటీగా సంతకం చేయకండి. ఇలాంటి సహాయాలు ఏదోక రోజు మీ మెడకే చుట్టుకుంటాయి.
- 34. డబ్బు ముఖ్యమే.. కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించకండి. తిరిగి రాని ఆస్తి మీ శరీరమే. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు..!
- 35. ప్రతి చిన్న ప్రాబ్లమ్‌కి అతిగా ఆలోచించకండి. ఒక్క అడుగు వెనక్కి వేసి, దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటే స్పష్టమైన దారి దానంతట అదే కనిపిస్తుంది.
- 36. అందరూ చేస్తున్నారు కదా అని ఇన్వెస్ట్‌మెంట్ల వెనక గుడ్డిగా పరుగెత్తకండి. అర్థం కాని వాటి జోలికి వెళ్లొద్దు. లాభం రాకపోయినా పర్లేదు, ఉన్నదాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
- 37. కుటుంబ సభ్యులతో ఓపికగా ఉండండి, క్షమించడం నేర్చుకోండి. వాదనలు తగ్గించండి. ప్రశాంతమైన ఇల్లు జీతం కన్నా విలువైంది.
- 38. ఇంకా పనిచేసే వస్తువులను పారేయకండి. రిపేర్ చేసి వాడుకోండి. ఇది తెలివైన పని, పిసినారితనం కాదు.
- 39. బుర్రలో అనవసరమైన ఆలోచనలు నింపుకోకండి. వదిలేయడం నేర్చుకోండి. మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే, రోజు అంత ఈజీగా గడుస్తుంది.
- 40. ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఆపేయండి. పనికిరాని పార్టీలకు దూరంగా ఉండండి. అవసరం ఉన్నప్పుడు ఆదుకోని స్నేహితులు ఎందుకు? ఈ విషయాన్ని గుర్తించండి..
- 41. ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో గమనించుకోండి. గొప్పలు వద్దు, గాసిప్స్ వద్దు. ఇతరుల డ్రామాల్లో తలదూర్చకండి.
- 42. ప్రతిరోజూ మీ ఆరోగ్యాన్ని, జేబును జాగ్రత్తగా కాపాడుకోండి. లేట్ నైట్ పార్టీలు, విపరీతమైన డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, పిచ్చి అప్పులు... జీవితంలో ఎప్పటికీ వద్దు!
- 43. స్థిరంగా బతకండి. నిజాయితీగా సంపాదించండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి. ఒక మనిషి జీవితానికి ఇంతకంటే ఏమీ అవసరం లేదు!
