ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ ను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ పై ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ చేయించినా తాము సహకరిస్తామన్నారు. ఇటువంటి ఆరోపణలకు, విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో తన పాత్ర ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  ప్రశ్నించే వాళ్లపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావన్నారు. బీజేపీ పాలసీలను ప్రశ్నిస్తున్నందుకే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. 

కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తన పేరును లిక్కర్ స్కామ్ లో తెరపైకి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయని, కానీ వాటన్నింటికి ఎప్పుడూ భయపడలేదు. దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, ఆయన వెంట తామంతా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి వారో తెలుసన్నారు. కొన్ని ఏజెన్సీలను, మీడియా సంస్థలను వాడుకుని తమను టార్గెట్ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. 

చండీయాగం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత 

అంతకుముందు..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. 

బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఏమన్నారంటే..?
ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో కేసీఆర్ కుటుంబసభ్యులు భేటీ అయ్యారని, అక్కడే వారికి డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు సూట్ రూం బుక్ అయి ఉందని ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్, లిక్కర్ మాఫియాకు చెందిన వ్యక్తులు, ఎక్సైజ్ అధికారులు హోటల్ రూంలో భేటీ అయి డీల్ గురించి చర్చలు జరిపారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో లిక్కర్ మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వచ్చేవారు. ఒబెరాయ్ హోటల్లో సూట్ రూం బుక్ చేసింది కూడా ఈ లిక్కర్ మాఫియా వ్యక్తే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఆయనే ఈ పాలసీని రూపొందించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోంది” అని వర్మ చెప్పారు. 

రూ. 150 కోట్లు ముట్టజెప్పిన్రు : పర్వేశ్​ వర్మ

కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎల్1 లైసెన్స్ హోల్డర్లు, తమ వ్యక్తులను ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నారని పర్వేశ్ వర్మ ఆరోపించారు. డీల్‌‌‌‌లో ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ కింద సిసోడియాకు రూ. 150 కోట్లు ఇచ్చారని, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ సొమ్మును ముట్టజెప్పారని తెలిపారు. ‘‘ఎల్1 కమీషన్ ముందుగా మేము తీసుకుంటాం. లాభాలూ తీసుకుంటాం. ఆ తర్వాతే మీరు తీసుకోవాలి’’ అని సిసోడియా డీల్ కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారా? లేదా? ఒబేరాయ్ హోటల్ లో వారిని కలిశారా లేదా? అనే ప్రశ్నలకు సిసోడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిసోడియా కోర్టు ముందు నిజాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.