కవిత ఈడీ విచారణకు హాజరవుతారా..? మళ్లీ స్కిప్​ చేస్తారా ?

 కవిత ఈడీ విచారణకు హాజరవుతారా..?  మళ్లీ స్కిప్​ చేస్తారా ?

హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్​స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అనిల్​కుమార్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్​కుమార్, లీగల్​ టీం, ముఖ్య అనుచరులతో కలిసి కవిత బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ ఎయిర్​పోర్టు నుంచి నేరుగా తుగ్లక్​రోడ్​లో ఉన్న సీఎం కేసీఆర్​నివాసానికి వారు వెళ్లారు. అయితే  కవిత సోమవారం ఈడీ విచారణకు అటెండ్​అవుతారా ?  మళ్లీ స్కిప్​ చేస్తారా ? అనే దానిపై డైలమా కొనసాగుతోంది

లీగల్ ​టీంతో భేటీ  

ఈడీ విచారణపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లీగల్​ టీంతో ఆదివారం రాత్రి కూడా సమావేశమయ్యారు. సోమవారం నాటి విచారణకు హాజరు కావాలా ? వద్దా ?  అటెండ్​ కాకుంటే లీగల్​గా ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే దానిపై చర్చించారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్​తో దీనిపై ఫోన్​లో సంప్రదింపులు జరిపారు. సోమవారం పరిస్థితులకు అనుగుణంగా విచారణకు వెళ్లాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈనెల 16న కవిత రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజున ఢిల్లీలోనే ఉన్నా వెళ్లలేదు. తన ప్రతినిధిగా బీఆర్ఎస్​ నేత, అడ్వకేట్​ సోమ భరత్​కుమార్​ను ఈడీ ఆఫీస్​కు ఆమె పంపారు. నిబంధనల మేరకు ఈడీ విచారణ సాగడం లేదంటూ  సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిపై అర్జంట్​గా విచారించలేమని, ఈనెల 24న విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తన పిటిషన్​పై నిర్ణయం ప్రకటించే వరకు విచారణకు రాలేనని అడ్వకేట్ ​ద్వారా ఈడీకి కవిత చెప్పారు. కవిత విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈడీ ఈనెల 20న (సోమవారం) విచారణకు హాజరుకావాలంటూ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కవిత పిటిషన్​పై సుప్రీం కోర్టులో ఈడీ కేవియట్​వేయడం, ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్​ ​ఒకరు కవితకు సూచించారు. ఆ సూచనతోనే కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.కాగా, మహిళ అయిన తనను ఇంటి దగ్గర విచారించేలా ఈడీ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14 న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై స్టేకు నిరాకరించిన సీజేఐ, విచారణను ఈ నెల 24 కు వాయిదా వేశారు. కవిత పిటిషన్​లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ ఈడీ సుప్రీం కోర్టులో కేవియట్​దాఖలు చేసింది.

ఆ ముగ్గురి కన్​ఫ్రంటేషన్​ విచారణ..

ఢిల్లీ లిక్కర్​స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్​ అయ్యారు. లిక్కర్​స్కాంలో తాను కవిత బినామీని అని విచారణలో ఒప్పుకున్న అరుణ్​ రామచంద్ర పిళ్లై ఆ స్టేట్​మెంట్​విత్ డ్రా చేసుకోవడానికి రౌస్​ఎవెన్యూ కోర్టులో పిటిషన్​వేశారు. కవిత పేరు ప్రస్తావించకుండానే ఈడీ ఆమె సెంట్రిక్​గానే దానిపై కౌంటర్​పిటిషన్​దాఖలు చేసింది. కవితతో పాటు అరుణ్​రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్​బుచ్చిబాబును ఈడీ కన్​ఫ్రంటేషన్ (ముఖాముఖి) విచారణ చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పిళ్లై ఈడీ కస్టడీని కోర్టు పొడగిస్తూ వస్తోంది.