
- శాంతియుత నిరసన చేస్తే కాల్పులు జరుపుతరా?
- బీసీల గొంతుకగా నిలిచిన.. వారి కోసం రెండేండ్లుగా పోరాడుతున్న
- మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
- మండలి చైర్మన్‌కు, డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: తాను మామూలు ఆడబిడ్డను కాదని, ఎక్కువ తక్కువ చేస్తే అగ్గిరవ్వనై రగులుతానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ ఆఫీసుకు తమ జాగృతి కార్యకర్తలు వెళ్లారని, అయితే గన్‌మ్యాన్ కాల్పులు జరుపుతరా? అని మండిపడ్డారు. ‘‘ఏమనుకుంటున్నరో మీరు..నా లాంటోళ్లను కోట్లాది మందిని తయారు చేస్త! మేం అనుకుంటే.. మా ఆడబిడ్డలు అనుకుంటే.. మీరు ఇంట్లకెంచి కూడా బయటకు వెళ్లలేరు. ఏదో ఆడబిడ్డ కదా.. ఓ సంస్థ నడుపుతున్నది కదా.. ఆమెను ఏమన్నా ఎవరుంటరనుకున్నరో ఏమో..! నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు, లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నరు. నేను మామూలు ఆడబిడ్డను కాదు.. చెప్తున్న. ఎక్కువతక్కువ చేస్తే అగ్గిరవ్వనై రగులుత’’ అని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్‌కు రెఫర్ చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. “దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రెండేండ్లుగా నేను ఉద్యమిస్తున్న. ఢిల్లీలో కూడా బీసీ గొంతుకగా నిలిచిన. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని గొంతు వినిపిస్తున్న. మా పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే రాష్ట్ర కేబినెట్ బీసీలకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించాం. కానీ ఎమ్మెల్సీ మల్లన్న నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధిని అయిన నాపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. సామాన్య మహిళల విషయంలో ఆయన ఎలాంటి భావనతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని కోరుతున్నా”అని కవిత తన ఫిర్యాదులో కవిత పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లక్డీకపుల్లోని డీజీపీ ఆఫీసులో లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని, జాగృతి కార్యకర్తలపై కాల్పులకు ప్రేరేపించారని అందులో ఆరోపించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను తట్టుకోలేక జాగృతి కార్యకర్తలు శాంతియుతంగా నిరసనను తెలిపేందుకు వెళ్తే.. వారిపై మల్లన్న గన్ మ్యాన్ కాల్పులకు పాల్పడ్డడు. ఈ ఘటనలో ఎవరికైనా ఏమైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఓ మహిళ ఎమ్మెల్సీపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ ఘటనపై నేను ఫిర్యాదు చేయడానికి వస్తే, సెలవు రోజు పేరిట డీజీపీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది” అని అన్నారు. కాల్పులకు పాల్పడిన గన్ మ్యాన్‌ను సస్పెండ్ చేయాలని, మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇరువర్గాలపై కేసులు..
మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జరిగిన దాడి ఘటనపై మల్కాజిగిరి ఏసీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దాడి ఘటనలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.