ఇది.. నిజం మాట్లాడినందుకు చెల్లించుకున్న మూల్యమా..? సస్పెన్షన్‎పై కవిత ఆసక్తికర ట్వీట్

ఇది.. నిజం మాట్లాడినందుకు చెల్లించుకున్న మూల్యమా..?  సస్పెన్షన్‎పై కవిత ఆసక్తికర ట్వీట్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‎పై పరోక్షంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు కవిత. ‘‘ఇది.. నేను నిజం మాట్లాడినందుకు చెల్లించుకున్న భారీ మూల్యమా..? తెలంగాణ ప్రజల కోసం ఇంతకంటే వందరెట్లు మూల్యం చెల్లించేందుకు నేను సిద్ధం’’ అని పోస్ట్ పెట్టారు కవిత. ఈ ట్వీట్‎కు సత్యమేవ జయతే.. జై తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్‎ జోడించారు. 

కాగా, బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ వేటు పడటంపై బుధవారం (సెప్టెంబర్ 3) ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు కవిత. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా బాంబులు పేల్చారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు మేకవన్నె పులులు అని.. ఈ ఇద్దరి వల్లే తన తండ్రి కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని వాపోయారు కవిత. 

హరీష్ రావు, సంతోష్ రావు అనే అవినీతి అనకొండలతో జాగ్రత్త అన్నా అంటూ తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎ను అప్రమత్తం చేశారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావే కుట్ర చేసి తనను సస్పెండ్ చేసేలా చేశారని ఆరోపించిన కవిత.. ఇవాళ తనకు ఎదురైన పరిస్థితే రేపు కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్‎కు కూడా ఎదురైతుందని హెచ్చరించారు.

హరీష్ రావు, సంతోష్ రావు పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారని.. వాళ్ల నుంచి పార్టీని, నాన్నను కాపాడు అన్నా అంటూ కేటీఆర్‎కు సూచించారు కవిత. ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసినా కవిత.. తాజాగా సోషల్ మీడియా వేదికగా కూడా తన ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్నారు.