మోడల్ స్కూల్ టీచర్లకు ..010 పద్దు కింద వేతనాలివ్వాలి : టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

మోడల్ స్కూల్ టీచర్లకు ..010 పద్దు కింద వేతనాలివ్వాలి : టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  •     టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 
  •     ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి 
  • సందీప్ కుమార్ సుల్తానియాకు వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ విధానం ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మల్క కొమరయ్య మాట్లాడారు.

 రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో సుమారు 3వేల మంది రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని, వారందరిని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌లో విలీనం చేయాలని కోరారు. మోడల్ స్కూల్ టీచర్ల సేవలను గుర్తించి, వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌‌లో మోడల్ స్కూల్ టీచర్లను ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో విలీనం చేసి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. 

తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్సీ కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, బీజేవైఎం నేత మల్క యశస్వి తదితరులు పాల్గొన్నారు.