డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ తీరు.. నల్గొండ జిల్లాకు శాపం :  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ తీరు.. నల్గొండ జిల్లాకు శాపం :  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్గొండ, వెలుగు :  ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపులో ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అనుసరిస్తున్న తీరు నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు శాపంగా మారిందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఖండించారు. శనివారం నల్గొండలో జరిగిన ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టుకు 436 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తరలించే అవకాశం కల్పించి, డిండి కాలువకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నిబంధన విధించడం జిల్లాపై జరుగుతున్న కుట్ర అని విమర్శించారు.

ఈ నిర్ణయం వల్ల డిండికి రావాల్సిన 30 టీఎంసీల నీరు కేవలం 7 టీఎంసీలకే పరిమితమై, మునుగోడు, దేవరకొండ లాంటి ప్రాంతాల్లోని 3.61 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం లాంటి ప్రాజెక్టులు వృథా కాకుండా ఉండాలంటే, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి వట్టెం ప్రాజెక్టుతో సమానంగా 436 మీటర్ల స్థాయి నుంచే డిండికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తమ ద్వంద్వ నీతిని వీడకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.