
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘటనపై ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. దోషులెవరో.. సమస్య ఎక్కడ వచ్చిందో తేల్చాలని కోరారు. కౌన్సిల్‌లో బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు ఇవ్వడం మానేసి.. బురద జల్లే కార్యక్రమం చేస్తున్నదని విమర్శించారు. డ్యామేజ్ అయిన పిల్లర్లను వేగవంతంగా పునరుద్ధరించాలని కోరారు.
పొలాలు ఎండుతున్నయ్: రవీందర్‌రావు
యాసంగి పంటలకు నీళ్లు వదలడం లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. మేడిగడ్డ పగిలిపోయిందని, అందుకే నీళ్లు ఇవ్వలేమని మహబూబాబాద్‌లో ఎస్‌ఈ తెలిపారని ఆయన ప్రస్తావించారు. మెడికల్ కాలేజీలకు బడ్జెట్ లేదని, ఫలితంగా పర్యవేక్షణ కరువైందని అన్నారు. దీనిపై మంత్రి పొంగులేలి స్పందిస్తూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటి లభ్యత తగ్గిందని, నీటి లభ్యతను బట్టి పంటలు వేసుకోవాలని సూచించామని తెలిపారు.
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత
సెక్రటేరియెట్ ప్రాంగణంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజీవ్ గాంధీ పట్ల తమకూ గౌరవం ఉందని, కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి, అధికారికంగా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, పల్లి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కవిత కోరారు. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా ప్రైవేటు వ్యాపారులు రూ.4 వేలు,- రూ.5 వేలకే కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌పై సభ్యులు లేవనెత్తి అంశాలకు సమాధానం చెప్పారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పలు ప్రత్యేక ప్రస్తావనలు, పిటిషన్లు అందించారు. బీఆర్‌ఎస్ సభ్యులు బుగ్గారపు దయానంద్, శేరి సుభాష్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు బల్మూరి వెంకట్ తదితరులు మాట్లాడారు. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని, జీఎంఆర్ ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ పాటించాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి కోరారు. పోలీసు విభాగంలో పీడీవో పోస్టులు భర్తీ చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయొద్దు: దేశ్‌పతి శ్రీనివాస్
రాష్ట్ర అధికారిక చిహ్నాలను తొలగించి తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయొద్దని ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్ కోరారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తెలంగాణ వారసత్వ సంపద అని తెలిపారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. చిహ్నాలను తొలగిస్తామని చెప్పలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.