ముషీరాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీసీ సమాజం గురించి బాగా చర్చ జరుగుతుందని, కులగణన చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని చెప్పారు. బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు తమ వ్యూహాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీసీల కుల జనగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షతన సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఈ దీక్షకు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపి, మాట్లాడారు. బీసీల్లో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. పదేండ్లకు ఒకసారి తెలంగాణ గడ్డ ఒక ఉద్యమాన్ని పుట్టిస్తుందని, బీసీల ఉద్యమం మరొక గొప్ప ఉద్యమంగా మారుతుందని మల్లన్న తెలిపారు.
బీసీ ఉద్యమం తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పదవి అని అన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే తన పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని ప్రతిష్టం చేయాలన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్వేచ్ఛ తమకే ఇచ్చారని తెలిపారు. బీసీ జన సభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేయడానికి సిద్ధపడిందని ఆరోపించారు.
ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, లేకపోతే బీసీ సంఘాలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నేత వినయ్ కుమార్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
