బీఆర్ఎస్ లోక్సభ ఇన్చార్జ్​లుగా ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ లోక్సభ ఇన్చార్జ్​లుగా ఎమ్మెల్సీలు

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల ఇన్​చార్జ్ లుగా బీఆర్ఎస్ తన ఎమ్మెల్సీలను నియమించనున్నది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్​లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశం కానున్నారు. దీనికి హాజరుకావాలని శాసన మండలిలోని బీఆర్ఎస్ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఎమ్మెల్యేలు సెంట్రిక్ గా పార్టీ వ్యవహారాలు సాగించడంతోనే ఎక్కువగా నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల ఇన్​చార్జ్​లుగా ఎమ్మెల్యేలకు బదులు ఎమ్మెల్సీలను నియమించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 9 లోక్ సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే ఎన్నికల ఇన్ చార్జ్​లు సహా అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించే సరళిపై గురువారం జరగనున్న మీటింగ్ లో కేటీఆర్, హరీశ్ రావు కొంత స్పష్టత ఇవ్వొచ్చని తెలుస్తున్నది.

కేసీఆర్ కోసం ర్యాంప్ 

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కోసం తెలంగాణ భవన్​లో ర్యాంప్ నిర్మించారు. బిల్డిం గ్ మెయిన్ ఎంట్రన్స్​లోని మెట్లపై వీల్ చైర్ వెళ్లడానికి వీలుగా ర్యాంప్ నిర్మించారు. ఈ నెల 13 నుంచి 17 వరకు లోక్​సభ నియోజకవర్గాల సన్నద్ధత సమావేశాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్​లోనే ర్యాంప్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.  కేసీఆర్ వారం పది రోజుల్లోపే భవన్​కు వచ్చే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆయన వాకర్ సాయంతో మెట్లపై వెళ్లకుండా కారు నుంచి దిగి నేరుగా భవన్​లోకి చేరుకునేలా ర్యాంప్ నిర్మిం చామని పార్టీ నేతలు చెప్తున్నారు. హిప్ రీ ప్లేస్ మెంట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సోమవారం ఉదయమే నందినగర్​లోని నివాసం నుంచి ఎర్రవల్లి ఫాంహౌస్​కు వెళ్లారు.