గరియాబంద్ ఎన్కౌంటర్లో ఇద్దరు తెలంగాణవాసులు

గరియాబంద్ ఎన్కౌంటర్లో ఇద్దరు తెలంగాణవాసులు
  • హైదరాబాద్​ నుంచి మోడెం బాలకృష్ణ, బెల్లంపల్లి జాడి వెంకటి ఉద్యమబాట
  • రాయ్​పూర్​లో పటిష్ట బందోబస్తు మధ్య పోస్టుమార్టం పూర్తి 
  • ఇన్​ఫార్మర్లు, మాజీల ద్వారా డెడ్​బాడీల గుర్తింపు

భద్రాచలం/కాజిపేట/బెల్లంపల్లి, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని గరియాబంద్​జిల్లా మైన్​పూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని భాలూడిగ్గీ గుట్టల్లో గురువారం జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను శుక్రవారం హెలికాప్టర్​ లో రాయ్​పూర్​కు తరలించారు. అక్కడ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణించిన ఆరుగురు పురుషులు, నలుగురు మహిళా మావోయిస్టులను ఇన్​ఫార్మర్లు, లొంగిన మావోయిస్టుల ద్వారా గుర్తించి పేర్లను ప్రకటించారు. 

మృతిచెందిన వారిలో కేంద్ర కమిటీ మెంబర్, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు మొడెం బాలకృష్ణ, మరో కీలక నేత ప్రమోద్​అలియాస్​పాండు  ఉన్నారు. అలాగే, విక్రమ్, టెక్నికల్​కమిటీ డీవీసీఎం విమల్​అలియాస్ సురేశ్, టెక్నికల్​కమిటీ డిప్యూటీ కమాండర్ ఉమేశ్, స్పెషల్ టీం సభ్యురాలు రజిత, అంజలి, సింధూ, ఆరతి, సమీర్​ఉన్నారు. రాయ్​పూర్​లో పోస్టుమార్టం నిర్వహించే ఆస్పత్రి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్​లో చదువుతూ ఉద్యమ బాట

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వారి తండ్రి వెంకటయ్యకు పోస్టుమ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏండ్ల కిందటే మకాం మార్చారు. బాలకృష్ణ కు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు (పీపుల్స్ వార్) పార్టీ పట్ల ఆకర్షి తుడైన బాలకృష్ణ.. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాట పట్టారు. కొంత కాలం రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్ యూ) జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించి.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. కాగా, పార్టీ పనిలో భాగంగా అడవినుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు 1993లో అరెస్టు చేశారు.

పోలీసు డీఐజీ కేఎస్ వ్యాస్ హత్య, ఎమ్మెల్యే కిడ్నాప్లతో పాటు బెంగళూరు ఆయుధాల స్వాధీనం, కుట్ర కేసుల్లో ఆయన సుమారు ఆరేండ్లు ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. 1999లో బెయిల్ పై విడుదలైన ఐదు రోజులకే తిరిగి అడవిబాట పట్టారు. సుమారు 26 ఏండ్లు ఏవోబీలో వివిధ కేడర్లలో పని చేశారు. ఆయనపై  చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏ ప్రకటించిన దానితో కలిపి రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్టు సమాచారం. 

కార్పెంటర్​ నుంచి మావోయిస్టు నాయకుడిగా  

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ సురేశ్.. జాడి శివయ్య, జాడి రాజమ్మ ముగ్గురు సంతానంలో చిన్నవాడు. మావోయిస్ట్ పార్టీలో డీసీఎం‌‌‌‌గా, పార్టీ టెక్నికల్ కమిటీలో ఆయన పనిచేశాడని పోలీసులు తెలిపారు. 1995లో పీపుల్స్ వార్ గ్రూప్‌‌‌‌లో కోరియర్‌‌‌‌గా పనిచేస్తూనే  నెన్నెల మండలం ఆవడం గ్రామంలో కార్పెంటర్‌‌‌‌గా జీవనం సాగించాడు. ముప్పై ఏండ్ల క్రితం గ్రామానికే చెందిన ఆవుల బాలమల్లును ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పోలీసులు తరచూ ఇంటికి వచ్చి వేధించడంతో భార్యతో కలిసి ఇంటిని వదిలి అజ్ఞాత జీవితం మొదలుపెట్టాడు. ఇంటిని వదిలి వెళ్లి 27 ఏండ్లు గడిచినా, తల్లిదండ్రులు మరణించినా ఆయన ఊరికి రాలేదు. 

2005-–06లో ఒడిశాలోని రూర్కెలాలో పార్టీ నాయకులతో కలిసి ఉన్న సమయంలో పోలీసులు వెంకటిని అరెస్ట్ చేశారు. కొన్నినెలలు వరంగల్ సెంట్రల్ జైలులో గడిపి బెయిల్‌‌‌‌పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వెంకటి భార్య ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప కూడా గత 27 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం చత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రంలో మహిళా డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. 

పుష్ప .. ఇంటికిరా బిడ్డా..

గరియాబంద్​ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో మృతి చెందిన జాడి వెంకటి అలియాస్ సురేశ్​ భార్య ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప ఆజ్ఞాతం వీడి బయటకు రావాలని ఆమె తల్లి ఆవుల పోశమ్మ, అన్నదమ్ములు ఆవుల గంగయ్య, ఆవుల శ్రీనివాస్‌‌‌‌ కోరారు. 27 ఏండ్లుగా మావోయిస్టు పార్టీల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న పుష్ప ప్రస్తుతం బీజాపూర్‌‌‌‌ ఏరియాలో పనిచేస్తున్నారు. సురేశ్​ మరణంతో పుష్ప ఇప్పటికైనా అజ్ఞాతం వీడాలని కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం వారు బెల్లంపల్లిలో మీడియాతో మాట్లాడారు. పుష్ప బయటకొచ్చి సాధారణ జీవితం గడపాలని విజ్ఞప్తి చేశారు.