చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నుంగంబాక్కంలో ఒక్క రోజులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నై శివారు రెడ్ హిల్స్ లో 13 సెంటీమీటర్ల వర్షం, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1990లో నగరంలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల దృష్ట్యా నగరంలోని గణేశపురం, రంగరాజపురం సబ్‌వేలను మూసివేశారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీంతో వాహనదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉత్తర చెన్నైలోని అన్నాసలై సమీపంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. కేశవపిళ్లై పార్క్ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలను మళ్లించారు. మోకాళ్ల లోతులో నీరు నిలవడంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
చెన్నైతో పాటు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రాంతీయ కేంద్రం వెల్లడించింది. ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. చెంగళపట్టు, విల్లుపురం, తిరుపత్తూరు, కళ్లకురిచ్చి, పుదుకోట్టై, నాగపట్నం, తంజావూరు, మైలదుతురై సహా ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 3 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని RMC చెన్నై హెడ్ డా.S. బాలచంద్రన్ తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు కాల్ సెంటర్ (1913)ని ఏర్పాటు చేసింది. మొత్తం 15 జోన్లలో కంట్రోల్ రూమ్‌లు, రిలీఫ్ షెల్టర్‌లు ఏర్పాటు చేశారు.

