రాష్ట్రంలో గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల నుంచి బుధవారం నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గిపోయిందని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా 0.9 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో బుధవారం మధ్యాహ్నం అరగంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. సెక్రటేరియట్, సోమాజీగూడ రోడ్లపై భారీగా వాననీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
సాగర్ డ్యాం నాలుగు క్రస్ట్ గేట్లు ఓపెన్
హాలియా, అమరావతి, వెలుగు: ఎగువన పడుతున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాం నుంచి 1 గేటు ద్వారా నాగార్జున సాగర్ కు 1,21 లక్షల క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు. 215.807 టీఎంసీల నీటి మట్టంతో శ్రీశైలం డ్యాం ఇప్పటికే నిండు కుండలా మారింది. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో బుధవారం సాగర్ నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా 46,226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యాంలో ప్రస్తుతం 312.0405 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

