- పెరగనున్న కటాఫ్ రాష్ట్రవ్యాప్తంగా గట్టి భద్రత మధ్య పరీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2026) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 199 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈ ఏడాది రాష్ట్రం నుంచి మొత్తం 93,700 మంది విద్యార్థులు నీట్ కోసం రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 91,500 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 97.65 శాతం అటెండెన్స్ నమోదైంది. 2,200 మంది (2.35 శాతం) మాత్రమే గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతించగా, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లను క్లోజ్ చేశారు. 2 గంటలకు మొదలైన ఎగ్జామ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమన్వయ కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్‌గా డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్, పోలీస్ ప్రతినిధిగా అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ పర్యవేక్షించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు భద్రతను సమీక్షించారు. ప్రతి ఐదు సెంటర్లకు ఒక సివిల్ నోడల్ ఆఫీసర్, ప్రతి సెంటర్ వద్ద ఒక పోలీస్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్వహించారు
ఈసారి పేపర్ మోడరేట్
2025లో నీట్ పేపర్ చాలా కఠినంగా రావడంతో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల దగ్గరే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది పేపర్ మధ్యస్థంగా (మోడరేట్) ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫిజిక్స్ లో నిరుడు 10 ప్రశ్నలకు జవాబు రాయడానికి కూడా ఇబ్బందిపడిన స్టూడెంట్లు.. ఈసారి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడంతో 35 వరకు ఈజీగా స్కోర్ చేయవచ్చంటున్నారు. ఇక కెమిస్ట్రీ 45 ప్రశ్నలలో 35 ప్రశ్నలు ఈజీగా వచ్చాయి.
బాటనీలో సుమారు 15 ప్రశ్నలు లెంతీగా ఉండడంతో చదవడానికి సమయం పట్టింది. ఓవరాల్ గా ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే వచ్చాయి. పేపర్ నిరుటి కన్నా సులభంగా ఉండడంతో కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
గతేడాది కన్వీనర్ కోటా 405 మార్కులకు సీటు రాగా, ఈసారి రాష్ట్రంలో కటాఫ్ 460 నుంచి 480 మార్కుల మధ్య ఉండవచ్చంటున్నారు. ఈ ఏడాది క్వాలిఫ్వయింగ్ 150 నుంచి 155 మార్కుల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రశ్నలు సులువుగా ఉన్నప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేసే చాన్స్ ఉంటుందని, అవి చేయని వారికే మంచి మార్కులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హన్మకొండలో 15 నిమిషాలు లేట్
హన్మకొండలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సెంటర్ లో ఇన్విజిలేటర్ల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. అందరి ఓఎంఆర్లు చెక్ చేసిన తర్వాతే పేపర్ ఓపెన్ చేయాలనే నిబంధన పెట్టి 15 నిమిషాల ఆలస్యంగా ఎగ్జామ్ ప్రారంభించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్య పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీల కోసం ఎగ్జామ్ టైమ్ వృథా చేశారని, చివర్లో 5 నిమిషాల ముందే పెన్నులు లాక్కున్నారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పేరెంట్స్, మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లోజు సత్యనారాయణాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
