హైదరాబాద్‎లో వాటర్ ట్యాంకర్లకు బార్ కోడ్.. ప్రతి ఫిల్లింగ్ పాయింట్ దగ్గర సీసీ కెమెరాలు

హైదరాబాద్‎లో వాటర్ ట్యాంకర్లకు బార్ కోడ్.. ప్రతి ఫిల్లింగ్ పాయింట్ దగ్గర సీసీ కెమెరాలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఎండలు మండిపోతుండడంతో వాటర్​ట్యాంకర్లకు భారీగా డిమాండ్​పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వెస్ట్​సిటీలోని మాదాపూర్, కొండాపూర్, మణికొండ, కోకాపేట, గండిపేట, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, మియాపూర్, ఎస్ఆర్​నగర్​తదితర ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్లు, హాస్టళ్లతో పాటు ఇండ్లలోనూ బోర్లు ఎండిపోయాయి.

 దీంతో వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్​ఏర్పడింది. వారం క్రితం వరకూ రోజుకు 10 నుంచి 11 వేల ట్యాంకర్లు బుక్​కాగా, రెండు మూడు రోజుల నుంచి రోజుకు 12  వేల నుంచి 13వేల ట్యాంకర్లు బుక్​అవుతున్నాయి. దీంతో అధికారులు వాటర్​ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. 

బార్​కోడ్​ ఐడియా..

పెరుగుతున్న డిమాండ్‎ను తట్టుకునేందుకు అధికారులు ట్యాంకర్ల సరఫరా పెంచాలనుకుంటున్నారు. ప్రస్తుతం 80 ఫిల్లింగ్​స్టేషన్ల నుంచి 1250 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు పక్కదారి పడుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రతి ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ టోకెన్‎పై ‘బార్ కోడ్’ పెట్టాలని నిర్ణయించారు. దీని వల్ల వాటర్​ట్యాంకర్ల లెక్కలు కచ్చితంగా ఉంటాయంటున్నారు. 

ఈ విధానంలో ప్రతి ఫిల్లింగ్ పాయింట్ దగ్గర బార్ కోడ్ స్కాన్ చేశాకే ట్యాంకర్ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. రోజుకు ఎన్ని ట్యాంకర్లు బుక్​అవుతున్నాయి..? డెలివరీ ఎన్ని అవుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ట్యాంకర్ల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రతి ఫిల్లింగ్​స్టేషన్‎లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిని హెడ్డాఫీసుకు లింక్​చేసి పరిశీలిస్తున్నారు.