తెలుగులోనే ఎక్కువ మంది తప్పిండ్రు

తెలుగులోనే ఎక్కువ మంది తప్పిండ్రు
  • యాదాద్రిలో పదో తరగతి 187 మంది ఫెయిల్
  • తెలుగులో 75, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో 39, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో 36

యాదాద్రి, వెలుగు:  మాతృభాష అయిన తెలుగులోనే పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో సగానికి పైగా మంది తెలుగులోనే ఫెయిల్ కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ   ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. మిగిలిన వారు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌, సైన్స్‌‌‌‌‌‌‌‌ వంటి సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు.  2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో యాదాద్రి జిల్లాలో ఉత్తీర్ణ శాతం పెరిగినా రాష్ట్ర ర్యాంక్ మాత్రం తగ్గింది. జిల్లాలో మొత్తం 8,918 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,766 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాలో ఉత్తీర్ణ   98.30గా నమోదైంది. గత ఏడాది రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈసారి 12వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో మొత్తం 152 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు.

 సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగులోనే అత్యధికంగా 75 మంది ఫెయిల్ అయ్యారు. విద్యార్థులకు తెలుగులో చదవడం, రాయడం మీద పట్టు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో ఇంగ్లిష్ మినహా అన్ని పాఠ్యాంశాలు తెలుగులో ఉండేవి. ప్రస్తుతం తెలుగు, హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టులు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లోనే ఉండటంతో విద్యార్థుల్లో తెలుగుపై పట్టు తగ్గిందని వారు అభిప్రాయపడుతున్నారు. హిందీలో ముగ్గురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో 39 మంది, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో 36 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫార్ములాలపై అవగాహన లేకపోవడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లోపించడం వల్ల మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలయ్యారని అంటున్నారు.

 సైన్స్‌‌‌‌‌‌‌‌లో 29 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ప్రయోగాత్మక అంశాలపై అవగాహన లేకపోవడం, డయాగ్రామ్‌‌‌‌‌‌‌‌లు సరిగా రాయకపోవడం దీనికి కారణమని చెబుతున్నారు. సాంఘిక శాస్త్రంలో మాత్రం కేవలం ఐదుగురు మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. తెలుగులో ఫెయిల్ అయిన 75 మందిలో 60 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. మొత్తం 187 మంది ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 28 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.