యంగ్ ఇండియా స్కూళ్లకు.. రూ.10 వేల కోట్లు ఇవ్వండి..కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర సర్కారు 

యంగ్ ఇండియా స్కూళ్లకు.. రూ.10 వేల కోట్లు ఇవ్వండి..కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర సర్కారు 
  • ‘సాస్కి’ నిధుల కోసం ప్రపోజల్స్​ సిద్ధం
  • ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా
  • ఈసారి రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్​లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలకు భారీగా నిధులు అవసరం ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక వెసులుబాటు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సహాయ పథకం కింద కనీసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరుతోంది.

ఒక్కో పాఠశాల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. సకల సౌకర్యాలతో కూడిన ఈ విద్యా సముదాయాలు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్‌‌ను నిర్మించాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రభుత్వం, కేంద్రం నుంచి అందే వడ్డీ లేని రుణాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. జూన్ 2027 నాటికి కనీసం 70 పాఠశాలలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి, విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. 

రిపోర్ట్​ సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ

రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్(సాస్కి) పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు 50 ఏండ్ల కాలపరిమితితో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల మేర వడ్డీ లేని రుణాలను కేటాయించింది. ఈ భారీ నిధి నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాను యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

విద్యాసంస్థల నిర్మాణం అనేది దీర్ఘకాలిక మూలధన పెట్టుబడి కనుక, ఈ నిధులను పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్రానికి పంపనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సమగ్రమైన ప్రాజెక్ట్​రిపోర్టును సిద్ధం చేస్తోంది. నిధులు మంజూరైతే భవన నిర్మాణ పనులతోపాటు స్కూళ్లలో అత్యాధునిక ల్యాబ్‌‌లు, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వేగవంతం కానుంది.

79 స్కూళ్లకు పరిపాలనా అనుమతులు

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో  ఒక్కో స్కూల్ కోసం 20 నుంచి 25 ఎకరాల విశాలమైన స్థలాన్ని సేకరించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే 100కు పైగా నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసింది. 79 పాఠశాలల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు లభించాయి.

వీటిలో 44 చోట్ల ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియగా.. కొన్నిచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా నియోజకవర్గాల్లో భూ సేకరణకు సంబంధించిన అడ్డంకులను తొలగించి, త్వరలోనే పనులు మొదలుపెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ స్కూళ్లు అందుబాటులో ఉండేలా రవాణా సౌకర్యం ఉన్న స్థలాలనే ఎంపిక చేస్తున్నారు. 

పలుచోట్ల వేగంగా పనులు

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌‌ఫోర్స్ టీంను కూడా ప్రభుత్వం నియమించి, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యనందించడమే యంగ్ ఇండియా స్కూళ్ల ప్రధాన ఉద్దేశం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర తదితర నియోజకవర్గాల్లో సివిల్​ వర్క్స్​ ప్రారంభించారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో పనులు అత్యంత వేగంగా జరుగుతుండగా, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు వంటి ప్రాంతాల్లోనూ నిర్మాణాలు ఊపందుకున్నాయి. అలాగే, భువనగిరి, నారాయణఖేడ్, పటాన్‌‌చెరు నియోజకవర్గాల్లో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసి గ్రౌండ్ లెవల్‌‌లో పనులు మొదలయ్యాయి.