- సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నేతలు
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తొలిసారి మరణించిన గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. వర్కర్ పనిచేస్తున్న కంపెనీ నుంచి రూ.10 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది. ప్రమాదవశాత్తు మరణించిన గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధినిర్వహణలో మరణించిన ఐదుగురు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం చెక్కులు పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షైక్ సలావుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. మరణించిన వర్కర్స్ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని గతంలో సీఎం, కార్మికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వారు అంగీకరించారని తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ ఉద్యమ చరిత్రలో ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు.
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్‌కు సమగ్ర సామాజిక భద్రత, ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు చట్టపరమైన రక్షణ కోసం యూనియన్నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ – స్విగ్గీ డెలివరీ వర్కర్, శ్యామ్ సుందర్ – ఉబెర్ బైక్ టాక్సీ డ్రైవర్, లోకుర్తి నరేశ్ – జొమాటో డెలివరీ వర్కర్, గార్లపాటి శశిధర్ రెడ్డి– టాక్సీ డ్రైవర్, దరావత్ మహేశ్ – బ్లింకిట్ డెలివరీ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఇటీవల పరిహారం అందించినట్లు తెలిపారు.
