
హైదరాబాద్: దేశంలో అతిపురాతన గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి కొత్త వెర్షన్ వచ్చేసింది. మోడ్రన్ కబడ్డీ పేరుతో కొత్త సొబగులు అద్దుకుంది. హైదరాబాద్ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కుంభం రాంరెడ్డి ఈ మోడ్రన్ కబడ్డీని రూపొందించారు. మోడ్రన్ కబడ్డీ మీద దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి డాక్టరేట్ కూడా సాధించారు. ఈ క్రమంలోనే మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఆ క్రీడను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
గురువారం కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మోడ్రన్ కబడ్డీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. మోడ్రన్ కబడ్డీ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ శారీరక ధారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడాకారులకు ఆటను మరింత సులభతరం చేసేందుకే ఈ మోడ్రన్ కబడ్డీని రూపొందించినట్లు మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంభం రాంరెడ్డి తెలిపారు. మోడ్రన్ కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరించారు.