ప్రతి పౌరుడు మోడీ, షానే కావలంటున్నరు

ప్రతి పౌరుడు మోడీ, షానే కావలంటున్నరు
  • ప్రధానిని కుటుంబంతో కలిసిన మోహన్ బాబు
  • దక్షిణాది తారలతో ప్రత్యేక కార్యక్రమం చేస్తానన్నరు: విష్ణు
  • ఎవరూ దేశం విడిచిపోవాలని మోడీ కోరుకోవడంలేదు: మంచు లక్ష్మి

న్యూఢిల్లీ, వెలుగు:  దేశాన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తి ని కలవడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇండియాను, ఇది నాదేశం అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. దేశానికి ఇలాంటి ప్రధాని అవసరమన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దేశం బాగుండాలని ఆలోచించే వ్యక్తి అని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి షా ద్వయమే పాలించాలని దేశంలోని ప్రతి ఆడబిడ్డ, ప్రతి పౌరుడు కోరుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలో కుమారుడు మంచు విష్ణు, కోడలు వెరోనికా, కుమార్తె మంచు లక్ష్మి తో కలిసి మోహన్ బాబు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ, దేశ పౌరుడిగా, సినిమా హీరోగా ఆయనను కలిసి అభినందనలు తెలిపామన్నారు. తాను1997లో బీజేపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి, పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, విద్యాసాగర్ రావులతో సాన్నిహిత్యం ఉందన్నారు. అయితే, బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడగగా, మోహన్ బాబు సమాధానం దాటవేశారు. మోడీ, షాతో సమావేశంలో అనేక అంశాలపై చర్చించామని, అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెప్తానన్నారు. మాజీ ఎంపీగా, రాజకీయ నాయకుడిగా కేంద్రంలో అనేక మంది అధికారులను, నేతలను తరచూ కలుస్తుంటానని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందన్నారు.

మోడీకి నార్త్, సౌత్ భేదం లేదు.. 

ప్రధానికి నార్త్, సౌత్ సినిమా పరిశ్రమ అన్న భేదం  లేదని, ఆ విషయం ఆయన మాటల్లో స్పష్టంగా తెలిసిందని హీరో మంచు విష్ణు అన్నారు. ఉత్తరాది సిని ప్రముఖులతో జరిగిన కార్యక్రమంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీ వారిని పిలవలేదన్న అంశంపై భేటీలో చర్చకు  వచ్చిందన్నారు. దీనిపై సౌత్ సినీ ఫీల్డ్ కొంత అసంతృప్తితో ఉన్న విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లానన్నారు.  ఆ ప్రోగ్రాం ఒక సందర్భంలో భాగంగా జరిగిందే తప్ప, ప్రత్యేకంగా నార్త్, సౌత్ తేడా లేదని మోడీ చెప్పారన్నారు. దక్షిణాది సినీ ప్రముఖులతో త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ఫాలో అప్ చేయాలని కోరగా, తానే ఫాలోఅప్ చేస్తానని మోడీ చెప్పారని తెలిపారు. తిరుపతిలోని విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టును సందర్శించేందుకు రావాలని ప్రధానిని కోరగా తప్పక వస్తానని హామీ ఇచ్చారన్నారు.