- పాత అసెంబ్లీలో మండలి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం
- సెంట్రల్ హాల్ నిర్మాణంపై ఇంజనీర్లు, అధికారులకు పలు సూచనలు
హైదరాబాద్, వెలుగు: రానున్న బడ్జెట్ సమావేశాల వరకు శాసనమండలి కోసం పాత అసెంబ్లీ భవనం సిద్ధం కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సీఎం.. సభ జరుగుతుండగా మధ్యలో పాత అసెంబ్లీ భవనానికి వెళ్లారు. అక్కడ శాసనమండలి కోసం జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మండలి కొత్త భవనం కోసం తెప్పించిన ఫర్నీచర్ ను చూసి .. సభ్యుల కోసం సిద్ధంగా ఉన్న కుర్చీల్లో కొద్ది సేపు కూర్చున్నారు. మండలి సభ్యులకు ఇవి ఏ మేరకు సౌకర్యవంతంగా ఉంటాయని పరిశీలించారు.
అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీ లాబీలోకి వచ్చారు. అక్కడ గ్లాస్ లతో ఏర్పాటు చేసిన గదులను, లాన్ ను పరిశీలించారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ, మండలి మధ్య సెంట్రల్ హాల్ నిర్మాణం కోసం ఇంజనీర్లు రూపొందించిన ప్లాన్ ను పరిశీలించారు. ఇటు ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు సభ ప్రారంభం అయ్యే ముందు, ఆ తర్వాత, సభ విరామం సమయంలో కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా ఈ సెంట్రల్ హాల్ నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న ఇంజనీర్లను, అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ప్రతి సభ్యుడిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ హాల్‌ను నిర్మించనున్నట్టు సీఎం చెప్పారు. సెంట్రల్ హాల్ నిర్మాణంతో మంత్రులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచూ కలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వెంట మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి కార్యదర్శి నర్సింహా చార్యులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు.
