- ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీం ఆదేశాలు
- ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
- కుల్దీప్ సింగ్ సెంగర్ పబ్లిక్ సర్వెంటే!
- సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మేం స్టే ఇవ్వం
- కానీ.. ఇది అసాధారణ పరిస్థితి.. సెంగర్‌కు నేర చరిత్ర ఉన్నది
- సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కామెంట్
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగర్‌ను రిలీజ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. సెంగర్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు అడ్వకేట్లు చేసిన అప్పీల్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహా వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.
ఢిల్లీ హైకోర్టు కామెంట్లపై అసహనం
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సెంగర్ ప్రజా సేవకుడు కాదని, పోక్సో చట్టంలోని కొన్ని కఠిన నిబంధనలు వర్తించవని ఢిల్లీ హైకోర్టు చేసిన కామెంట్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను పబ్లిక్ సర్వెంట్‌గా గుర్తిస్తాం. అప్పుడు ఎమ్మెల్యే లేదంటే ఎంపీని పబ్లిక్ సర్వెంట్ కేటగిరీ నుంచి మినహాయిస్తే ఎలా? ఢిల్లీ హైకోర్టు చేసిన కామెంట్లు.. చట్టపరంగా సరైన వివరణ కాదు.
సాధారణంగా హైకోర్టులు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వెంటనే స్టే విధించదు. కానీ, ఈ కేసులో ఉన్న అసాధారణ పరిస్థితులు, నిందితుడి నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌పై స్టే విధిస్తున్నం. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా సెంగర్ శిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో కూడా ఆయన జైల్లోనే ఉండాలి.
బాధితురాలికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉన్నది. బాధితురాలు స్వయంగా కోర్టులో పోరాడేందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని లీగల్ సర్వీసెస్ కమిటీ అందజేయాలి’’అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సెంగర్‌కు సమాధానం ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఆయనకు 4 వారాల గడువు ఇచ్చింది.
మా సాక్ష్యాలను సీబీఐ పట్టించుకోవట్లే: బాధితురాలి తరఫు అడ్వకేట్
సుప్రీం కోర్టు స్టే విధించిన తర్వాత బాధితురాలి తరఫు అడ్వకేట్ మెహమూద్ ప్రాచా మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు స్టే విధించడం.. విజయం కాదు. కేవలం ఊపిరి పీల్చుకునే టైమ్ మాత్రమే ఇచ్చింది. కేసులోని అసలు లోతైన అంశాలను కోర్టు ఇంకా విచారించలేదు. సీబీఐ చాలా పరిమితమైన పాయింట్లను మాత్రమే కోర్టు ముందు ఉంచింది. మా వద్ద ఉన్న బలమైన సాక్ష్యాలు, వాదనలను పట్టించుకోలేదు.
బాధితురాలి తరఫు అడ్వకేట్లమైన మమ్మల్ని కనీసం సంప్రదించలేదు. మమ్మల్ని ఈ విచారణలో ఒక పక్షంగా చేర్చలేదు. బాధితురాలిని సీఆర్పీఎఫ్ తీసుకెళ్లిపోయింది. ఆమెతో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా సంతోషంగా ఉంటాను?’’ అని అడ్వకేట్ మెహమూద్ ప్రాచా తెలిపారు.
యోగీజీ.. మాకు రక్షణ కల్పించండి: బాధితురాలు
సుప్రీం కోర్టు స్టే విధించిన తర్వాత బాధితురాలు సోషల్ మీడియాలో కీలక కామెంట్లు చేసింది. ‘‘స్టే విధించడం సంతోషంగా ఉంది. నాకు సుప్రీం కోర్టుపై పూర్తి నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతదని భావిస్తున్నాను. నిందితుడు బయటకు వస్తే నాతో పాటు నా ఫ్యామిలీకి ప్రాణ హాని ఉంటది. సుప్రీం కోర్టు, సీఎం యోగి ఆదిత్యనాథ్ రక్షణ కల్పించాలి. డబ్బు ఉన్నవారే గెలుస్తారు.. లేనివాళ్లు ఓడిపోతారు. బెయిల్ వ్యవహారంలో కొంత మంది అధికారులకు లంచాలు అందాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు డబ్బులు ముట్టజెప్పారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి కూడా డబ్బులు తీసుకున్నారు’’అని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.
ఎనిమిదేళ్లుగా పోరాడుతున్నాం.. సెంగర్ కూతురు
కుల్దీప్ సెంగర్ బిడ్డ ఇషితా సెంగర్.. ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ వాదనలు వినకుండా కేవలం ప్రజా ఒత్తిడి, ప్రచారాలతో తీర్పులు వెలువరించడంతో తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందన్నారు. అవమానాలు, బెదిరింపులు తమకు నిత్యకృత్యమయ్యాయని వాపోయారు. ఇవన్నీ ఎదుర్కొంటూ రాజ్యాంగంపై, న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు.
ఈ కేసులోని మెరిట్ల గురించి మా వాదనను కోర్టులు వినిపించుకోవడంలేదని, పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు పలుమార్లు తన స్టేట్మెంట్ మార్చేసిందని, రేప్ జరిగిందని చెబుతున్న సమయాన్ని ఇప్పటికే మూడుసార్లు మార్చిందని, ఆ సమయంలో బాధితురాలు మైనర్ కాదని వైద్యుల నివేదిక కూడా స్పష్టంగా తేల్చిందని ఇషితా సెంగర్ చెప్పారు.
