- రేకులు, వెదురు తడకలను కోసుకుని బయటపడటంతో తప్పిన ప్రాణాపాయం
- మంటల్లో చిక్కుకుని పెంపుడు జంతువులు దహనం
- కాలిపోయిన సామాగ్రి.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీపు దాస్‌ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. పిరోజ్‌పూర్ జిల్లాలో హిందూ ఫ్యామిలీలు ఉంటున్న ఐదు ఇండ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీపు దాస్‌ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. పిరోజ్‌పూర్ జిల్లా దుమ్రితల గ్రామంలోని ముస్లిం ప్రభావిత ప్రాంతంలో ఒకే హిందూ కుటుంబానికి (సాహా కుటుంబం) చెందిన ఐదు ఇండ్లకు బయట గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టు అనుమానిస్తున్నారు.
కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోతున్న సమయంలో బయట నుంచి తలుపులకు గడియ పెట్టి, ఒక గదిలో బట్టలు కుక్కి నిప్పంటించారు. దీనివల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులు రేకులు, వెదురు తడకలను కోసుకుని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, వారి సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యింది. వారి పెంపుడు జంతువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.
ఐదుగురి అరెస్ట్..
ఈ ఘటనపై పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురిని విచారిస్తున్నట్టు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ.. ‘‘మేం ఉదయం లేచే సరికి ఇండ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాం. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి వెదురు ఫెన్సింగ్‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
