- నిరుటితో పోలిస్తే పెరిగిన 10 వేల మంది బాధితులు
- రేబిస్ వ్యాధితో 32 మంది మృతి
- గ్రామాల్లో కోతుల బెడద.. వృద్ధులపై దాడులు
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన డోర్నకల్ ఎమ్మెల్యే
- మద్దతుగా స్పందించిన స్పీకర్
- సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రజలను కుక్కలు, కోతుల బెడద వేధిస్తున్నది. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నరు. ముఖ్యంగా పదేండ్లలోపు చిన్నారులైతే ఒంటరిగా బయటికెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది 1.31 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు.
నిరుడితో పోలిస్తే 10వేల మంది బాధితులు పెరిగినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. అదే సమయంలో కోతులు కరిచిన కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలుచోట్ల కుక్కలు కరిచి చిన్న పిల్లలు చనిపోయిన ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో రేబిస్ మరణాల సంఖ్య కూడా పెరిగింది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఎదుర్కొంటున్న కుక్కల బెడద అంశాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడదను అరికట్టాలని కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం కోతుల బెడదతో జరుగుతున్న నష్టాలను అసెంబ్లీకి వివరించారు. వికారాబాద్ ఏరియాలో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను నాశనం చేస్తున్నాయని చెప్పారు. కుక్కలు, కోతుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచించారు.
ఏటా పెరుగుతున్న కుక్క కాటు కేసులు
కుక్క కాటు కేసులు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. సగటున రోజుకు 300 మందిని కుక్కలు కరుస్తున్నాయి. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతీ రోజు 100 మంది కుక్కకాటుకు గురవుతున్నట్లు ప్రభుత్వ ఆఫీసర్లు చెప్తున్నారు. 2022లో రేబిస్ వ్యాధి బారినపడి 8 మంది చనిపోతే ఈ ఏడాది 32 మంది మరణించారు.
2024లో కుక్క కాటు బాధితులు 1.21 లక్షల మంది ఉండగా.. ఈ ఏడాది మరో 10 వేలు పెరిగి 1.31 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట గంటకు 20 మందిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటి దాకా 4.60 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.80 లక్షల వీధి కుక్కలు
రాష్ట్రంలో వీధికుక్కల సంఖ్య 3.80 లక్షలు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 వేలు ఉంటాయని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. వీటికి సరైన ఆదరణ.. తిండిపెట్టేవాళ్లు లేక చిన్నారులపై దాడిచేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్తున్నప్పుడో.. వీధిలో ఆడుకుంటున్నప్పుడో.. సైకిల్ మీద ప్రయాణిస్తున్నప్పుడో ఎక్కువగా చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నాయి.
ఒంటరిగా ఉన్న 15 ఏండ్లలోపు వారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో 35% ఇండియాలోనే జరుగుతున్నాయని.. అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో వీటి సంఖ్య ఎక్కువ అని అంటున్నారు.
కాగా, విదేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. రోడ్లపై కనిపిస్తే వాటిని బంధిస్తారు. 10 రోజుల్లోగా ఎవరైనా వచ్చి తీసుకెళ్లకపోతే వాటిని చంపేస్తారు. పెంపుడు కుక్కల విషయంలో ఓనర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కుక్కల మల మూత్ర విసర్జనకు, వాకింగ్ వంటి పనులకోసం వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, స్పోర్ట్ కాంప్లెక్స్ వంటి ఏరియాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
కోతల బెడద తక్కువేమి కాదు
గ్రామాల్లోనూ కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోతులను పట్టి గ్రామంలో లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన చాలా మంది అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించారు. వృద్ధులు నివాసం ఉన్న ఇండ్లల్లోకి కోతులన్నీ గుంపుగా వెళ్లి దాడిచేసి సామా న్లు ఎత్తుకెళ్తున్నాయి. చిన్నపిల్లలు వీధి వెంబడి నడుచుకుంటూ పోతే వాళ్లపై దాడి చేసి గాయప రుస్తున్నాయి. కోతులతో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు నరకం చూపిస్తున్నాయి. పంటలపై మూకుమ్మడిగా దాడిచేసి నష్టపరుస్తున్నాయి.
