ప్రాజెక్టుల‌‌కు రాజ‌‌కీయ‌‌ గండం.. కృష్ణా జ‌‌లాల‌‌పై తెలంగాణకు అన్యాయం ఇలా జరిగింది !

ప్రాజెక్టుల‌‌కు రాజ‌‌కీయ‌‌ గండం.. కృష్ణా జ‌‌లాల‌‌పై తెలంగాణకు అన్యాయం ఇలా జరిగింది !

నీరు, నిధులు, నియామ‌‌కాల కోసం ఉద్యమం జరిగి చివ‌‌ర‌‌కు జూన్ 2014లో  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో మొట్టమొద‌‌ట‌‌గా చేప‌‌ట్టిన ప్రాజెక్టు పాల‌‌మూరు రంగారెడ్డి.  2014 ఆగ‌‌స్టు నెల‌‌లో ఇంజినీరింగ్​ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇ.ఎస్‌‌.ఐ) వారికి స‌‌మ‌‌గ్ర స‌‌ర్వే జ‌‌రిపి డి.పి.ఆర్‌‌. త‌‌యారుచేయుట‌‌కు ప‌‌నులు అప్పగించారు. 

ఇ.ఎస్‌‌.ఐ. వారు స‌‌మ‌‌గ్ర స‌‌ర్వే చేసి డి.పి.ఆర్ త‌‌యారుచేసి ప్రభుత్వానికి ఇవ్వడం జ‌‌రిగింది. ఈ డి.పి.ఆర్‌‌. ప్రకారం జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాట‌‌ర్ నుంచి నీటిని ఎత్తిపోత‌‌ల ద్వారా ద‌‌క్షిణ తెలంగాణ‌‌కు సాగునీరు అందించుట‌‌. ఈ డి.పి.ఆర్‌‌. అప్పటి ముఖ్యమంత్రి స‌‌మ‌‌క్షంలో చ‌‌ర్చించిన‌‌ప్పుడు ఆయ‌‌న ఈ డి.పి.ఆర్‌‌. ఒప్పుకోక‌‌,  నీటిని జూరాల నుంచి కాక శ్రీ‌‌శైలం నుంచి ఎత్తిపోత‌‌ల ద్వారా తీసుకోవాల‌‌ని, అందుకు మ‌‌ర‌‌ల కొత్తగా డి.పి.ఆర్. తొంద‌‌ర‌‌గా త‌‌యారు చేయాల‌‌ని ఆదేశించ‌‌డం జ‌‌రిగింది. 

ఇ.ఎస్‌‌.ఐ. వారు ఎటువంటి ఫీల్డ్ స‌‌ర్వే లేకుండా  మ్యాపుల ఆధారంగా ఒక నెల‌‌లోపు కొత్త డి.పి.ఆర్‌‌. త‌‌యారు చేశారు.   ఇందులో వారు రెండు ర‌‌కాల ప‌‌ద్ధతులు సూచించారు.   ఈ డి.పి.ఆర్‌‌.  తేది 21-–5-–2015 నాడు అప్పటి  సీఎం స‌‌మ‌‌క్షంలో చ‌‌ర్చించిన‌‌ప్పుడు ముఖ్యమంత్రి రెండ‌‌వ ఆల్టర్​నేటుకు ఒప్పుకుంటూ  ఎత్తిపోత‌‌ల ఎత్తు త‌‌గ్గించ‌‌మ‌‌ని అలాగే కొత్తగా క‌‌రివేన వ‌‌ద్ద ఒక రిజ‌‌ర్వాయ‌‌ర్ నిర్మించ‌‌మ‌‌ని ఆదేశాలు జారీచేయ‌‌డం జ‌‌రిగింది.  ఈవిధంగా ఇంత పెద్ద ప్రాజెక్టును ఇంజ‌‌నీర్ల ప్రమేయం లేకుండా రాజ‌‌కీయ నిర్ణయం తీసుకోవ‌‌డం జ‌‌రిగింది.

కృష్ణా జ‌‌లాల‌‌పై తెలంగాణకు అన్యాయం
ఎటువంటి  అనుమతులు లేకుండా ప్రాజెక్టు ప‌‌నులు మొదలై చివ‌‌ర‌‌కు 2023 నాటికి సుమారు 80% ప‌‌నులు పూర్తి కాగా ఒక్క ఎక‌‌రాకూ నీళ్లు ఇవ్వలేదు. ఎన్నిక‌‌ల‌‌ను దృష్టిలో ఉంచుకొని పూర్తికాని ప్రాజెక్టును తేది 16-–9-–2023 నాడు సీఎం  ప్రారంభించారు.  అంత‌‌వ‌‌ర‌‌కు పాల‌‌మూరు – రంగారెడ్డి  ప్రాజెక్టు కోసం  ఎక్కువ వ‌‌డ్డీతో అప్పులు తెచ్చి రూ. 27 వేల కోట్లు ఖ‌‌ర్చు చేయ‌‌డం జరిగింది. 

అప్పటినుంచి కొత్త ప్రభుత్వం గ‌‌త రెండేండ్లలో  రూ. 7 వేల కోట్లు ఖ‌‌ర్చు చేసింది. అయినా,  ఇంత‌‌వ‌‌ర‌‌కు ఒక్క ఎక‌‌రాకు కూడా సాగునీరు అంద‌‌లేదు.  ఇది ఇట్లుంటే  బీ.ఆర్‌‌.ఎస్‌‌, కాంగ్రెస్ పార్టీలు  కృష్ణా జ‌‌లాల‌‌పై తెలంగాణకు అన్యాయం జ‌‌రుగుతోంద‌‌ని, దానికి బాధ్యులు మీరంటే మీర‌‌ని కాలం గ‌‌డుపుతున్నారు. మ‌‌న‌‌కు రావ‌‌ల‌‌సిన  నీటి వాటా రావ‌‌ల‌‌సిందే.

అయితే, 11 సంవ‌‌త్సరాల క్రితం కృష్ణాన‌‌దిపై  మొద‌‌లుపెట్టిన ప్రాజెక్టు ఇంత‌‌వ‌‌ర‌‌కు రూ. 34 వేల కోట్లు (27 వేల కోట్లు + 7 వేల కోట్లు) ఖ‌‌ర్చు చేసి ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయింది.  కొత్త ప్రభుత్వంపై ఈ ప్రాజెక్టును తొంద‌‌ర‌‌గా పూర్తి చేస్తే బి.ఆర్‌‌.ఎస్‌‌. కు ఎక్కడ పేరొస్తుందో అని ప‌‌ని ఆల‌‌స్యం చేస్తున్నార‌‌న్న అప‌‌వాదు ఉంది.  ఎస్‌‌.ఎల్‌‌.బి. సి. ట‌‌న్నెల్​ ప‌‌నులు గ‌‌త 20 సంవ‌‌త్సరాలుగా జ‌‌రుగుతున్నా ప‌‌నులు కొలిక్కిరాలేదు.  ఈ మ‌‌ధ్య ట‌‌న్నెల్ కూలిన‌‌ప్పుడు రాజ‌‌కీయ‌‌పార్టీలు ఒక‌‌రిమీద ఒక‌‌రు దుమ్మెత్తి పోసుడుకే స‌‌రిపోయింది.  ప్రస్తుతం ట‌‌న్నెల్ ప‌‌ని ఎప్పుడు పూర్తి అవుతుంది, దానికి ఎంత ఖ‌‌ర్చు అవుతుంది అన్న అంచ‌‌నాలు లేవు.

ప్రాజెక్టుల‌‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
కాంగ్రెస్  ప్రభుత్వం గ‌‌త రెండు సంవ‌‌త్సరాలుగా ప్రాజెక్టు  దెబ్బతిన్న దానిపై విజిలెన్స్‌‌తో  విచార‌‌ణ‌‌, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి విచార‌‌ణ‌‌, చివ‌‌ర‌‌కు ఘోష్  క‌‌మిష‌‌న్  విచార‌‌ణ‌‌తో  గ‌‌త  రెండు  సంవ‌‌త్సరాలుగా కాల‌‌యాప‌‌నే కాక‌‌  బి.ఆర్‌‌.ఎస్‌‌. ప్రభుత్వం త‌‌ప్పిదాన్ని ఎత్తిచూపుట‌‌కు వాడుకుంది. కాంగ్రెస్  ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే  గ‌‌త  రెండేండ్లలో కాళేశ్వరం  ప్రాజెక్టుకు మ‌‌ర‌‌మ్మత్తులు జ‌‌రిపించ‌‌వ‌‌చ్చు.  కానీ,  అలా జ‌‌ర‌‌గ‌‌లేదు.  అది అట్లుంటే ఎప్పుడో మ‌‌రిచిపోయిన ప్రాణ‌‌హిత – చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మిస్తామ‌‌ని కొత్త బాణి అందుకున్నారు.

కాళేశ్వరం, పాల‌‌మూరు – రంగారెడ్డి  ప్రాజెక్టుల‌‌పై  ప్రభుత్వం శ్వేత‌‌ప‌‌త్రం విడుద‌‌ల చేయాలి.  ఈ విధంగా రెండు  ప్రధాన‌‌ పార్టీలు  కాళేశ్వరం, పాల‌‌మూరు– రంగారెడ్డి ప్రాజెక్టుల‌‌ను, అలాగే  కృష్ణా,  గోదావ‌‌రి న‌‌దిలో  మ‌‌న నీటి వాటాపై ఏర్పడ్డ స‌‌మ‌‌స్యను రాజ‌‌కీయ ల‌‌బ్ధికోసం వాడుకుంటున్నాయి.  ఇప్పటికైనా కాంగ్రెస్ ప్ర‌‌భుత్వం రాజ‌‌కీయాలు ప‌‌క్కన పెట్టి ఈ రెండు ప్రాజెక్టుల‌‌ను  యుద్ధ ప్రాతిప‌‌దిక‌‌న చేప‌‌ట్టి పూర్తి చేయాల‌‌ని ఫోరం ఫ‌‌ర్ గుడ్ గ‌‌వ‌‌ర్నెన్స్ కోరుతోంది. 

ల‌‌క్ష కోట్ల కాళేశ్వరం
ఉమ్మడి రాష్ట్రంలో జ‌‌ల‌‌య‌‌జ్క్షంలో భాగంగా బి.ఆర్‌‌. అంబేద్కర్ ప్రాణ‌‌హిత – చేవెళ్ళ ప్రాజెక్టుకు జి.ఓ. 124 తేది 16-–5-–2007 ద్వారా అనుమ‌‌తి ఇవ్వడమైనది.  నిర్మాణ ఖ‌‌ర్చు రూ. 17,875 కోట్లుగా 
12 ల‌‌క్షల ఎక‌‌రాల‌‌కు సాగునీరు అందించుట‌‌కు ప్రణాళిక  రూపొందించడమైనది.   అయితే,  ఇంకా కొన్ని ప్రాంతాల‌‌కు నీరు అందించాల‌‌ని త‌‌ట్టెడు మ‌‌ట్టి తీయ‌‌కుండానే ప్రాజెక్టు ఎస్టిమేట్ రూ.40 వేల‌‌ కోట్లకు పెంచి ప‌‌ని ప్రారంభించి 2014 నాటికి రూ. 8 వేల కోట్లు ఖ‌‌ర్చు  చేయ‌‌డం జ‌‌రిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ త‌‌రువాత  ప్రాణ‌‌హిత – చేవెళ్ళ ప్రాజెక్టును ప‌‌క్కన  పెట్టి  ర‌‌క‌‌ర‌‌కాల కార‌‌ణాలు చెపుతూ బి.ఆర్‌‌.ఎస్‌‌. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు  మొద‌‌లుపెట్టారు.  ప్రాణ‌‌హిత  ప్రాజెక్టు అలాగే ప‌‌నిచేసినా 2020 నాటికి పూర్తి అయ్యి 12 ల‌‌క్షల ఎక‌‌రాల‌‌కు సాగునీరు అందించేది.  బి.ఆర్‌‌.ఎస్‌‌. ప్రభుత్వం గ‌‌త ప‌‌ది సంవ‌‌త్సరాలుగా ల‌‌క్ష కోట్లకు పైబ‌‌డి ఖ‌‌ర్చుతో కాళేశ్వరం క‌‌ట్టి దానిని ప్రతి సంద‌‌ర్భంలో గొప్పగా చెప్పుకోవ‌‌డం జ‌‌రిగింది.  ఎన్నిక‌‌ల‌‌కు కొద్ది రోజుల ముందు పిల్లర్లు కుంగిపోవ‌‌డంతో కాంగ్రెస్ పార్టీ దీనిని  వీలున్న ప్రతి చోట కాళేశ్వరం కుంగును ఒక రాజ‌‌కీయ‌‌ అస్త్రంగా వాడుకుంది. 

యం. ప‌‌ద్మనాభ‌‌రెడ్డి, అధ్యక్షుడు, ఫోరం ఫ‌‌ర్ గుడ్ గ‌‌వ‌‌ర్నెన్స్