భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం

 భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం

రాజ్‌‌‌‌కోట్/బెంగళూరు: న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు ఇండియా టీమ్ సెలెక్షన్ ముంగిట ఉత్తర ప్రదేశ్‌‌‌‌ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (101 బాల్స్‌‌‌‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 160 నాటౌట్) విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో విజృంభించాడు. దాంతో గ్రూప్‌‌‌‌–బిలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో యూపీ 54 రన్స్‌‌‌‌ తేడాతో బరోడాపై గెలిచింది. జురెల్‌‌‌‌కు తోడు రింకూ సింగ్ (63), ప్రశాంత్ వీర్ (35) రాణించడంతో యూపీ నిర్ణీత 50 ఓవర్లలో  369/7 భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో బరోడా కెప్టెన్ క్రునాల్ పాండ్యా (82) పోరాడినప్పటికీ ఆ జట్టు 315  రన్స్‌‌‌‌కే ఆలౌటైంది.

ఇక లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోయినా.. కెప్టెన్ రిషబ్ పంత్ (22) విఫలమైనా గ్రూప్‌‌‌‌–డి పోరులో ఢిల్లీ జట్టు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. తొలుత  సౌరాష్ట్ర 320/7 స్కోరు చేసింది. విశ్వరాజ్‌‌‌‌సింగ్ జడేజా (115) సెంచరీతో  మెరిశాడు. అనంతరం ప్రియాంశ్‌‌‌‌ ఆర్య (78), తేజస్వి దహియా (53), హర్ష్ త్యాగి (49)తో పాటు చివర్లో నవదీప్ సైనీ (34 నాటౌట్) మెరుపులతో ఢిల్లీ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. 

ఇక, టీమిండియాకు దూరమైన పేసర్ ముకేశ్ కుమార్ (5/59), వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ (3/69) సత్తా చాటడంతో బెంగాల్ 6 వికెట్ల తేడాతో చండీగఢ్‌‌‌‌పై గెలిచింది. కెప్టెన్ మనన్ వోహ్రా (122) సెంచరీతో చండీగఢ్  48.2 ఓవర్లలో 319 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఛేజింగ్‌‌‌‌లో  ఓపెనర్ అభిషేక్ పోరెల్ (106), షాబాజ్ అహ్మద్ (76 నాటౌట్) రాణించడంతో బెంగాల్ 47.4 ఓవర్లలోనే 320/4 స్కోరు చేసి గెలిచింది.