కట్నం కేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష రద్దు : హైకోర్టు

కట్నం కేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష రద్దు : హైకోర్టు
  •     తీర్పు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వరకట్నం వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దుచేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. మెదక్‌‌‌‌  జిల్లా మునిపల్లికి చెందిన లక్ష్మి 2011లో కట్నం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారంటూ కేసు నమోదైంది. 

కేసు విచారించిన వికారాబాద్‌‌‌‌  కోర్టు.. లక్ష్మి భర్త, అత్త మామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2016లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్‌‌‌‌  కె.లక్ష్మణ్, జస్టిస్‌‌‌‌  వాకిటి  రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆత్మహత్య చేసుకునే ముందు వివాహిత వేధింపులకు, హింసకు గురైనట్లు ఆరోపణలు ఉంటే చాలదని, తగిన ఆధారాలు చూపాలని బెంచ్  పేర్కొంది. 

కట్నం వేధింపులకు సంబంధించి అంతకుముందు ఫిర్యాదు చేయలేదని స్వయంగా మృతురాలి తండ్రి అంగీకరించారని చెప్పింది. కట్నం డిమాండ్‌‌‌‌  చేసినట్లు స్వతంత్ర సాక్షులు కూడా లేరన్నారు. ఆడపడుచు, ఆమె భర్త హైదరాబాద్‌‌‌‌లో నివాసం ఉంటున్నారని, పండుగకు వచ్చినవారిపై కూడా కేసుకు సంబంధించి నిర్దిష్ట ఆరోపణలు లేవని బెంచ్  వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌‌‌‌  ఆధారాలు సందేహాస్పదంగా ఉండటంతో ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.