- ముఖంపై 18 కుట్లు వేసిన డాక్టర్లు
గండిపేట/జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్లో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు చోట్ల కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అత్తాపూర్ వాసుదేవ్ రెడ్డి నగర్ కాలనీలో మూడేళ్ల చిన్నారి నిత్యశ్రీ సోమవారం మధ్యాహ్నం తమ ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ వీధికుక్క అక్కడకు చేరుకొని నిత్యశ్రీపై దాడి చేసింది. దీంతో చిన్నారి ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కను తరిమేసి చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
గాయాలు ఎక్కువ కావడంతో డాక్టర్లు 18 కుట్లు వేశారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతున్నదని, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా.. అత్తాపూర్ వాసుదేవ్‌రెడ్డి నగర్లో కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్లో బాలుడు..
కుత్బుల్లాపూర్ లోని జైశ్రీరామ్నగర్లో ఓ చిన్నారి ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. ఎల్కేజీ చదువుతున్న అభిలాష్(5) తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. రెండు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. మరో మూడు కుక్కలు సైతం దాడికి యత్నించగా ఇరుగుపొరుగు వారు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
