వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో మోడీ, బైడెన్ ఆర్టికల్

వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో మోడీ, బైడెన్ ఆర్టికల్

వాషింగ్టన్:  కరోనా విపత్తు వల్ల ప్రపంచంలో అలముకున్న చీకట్లను తొలగించి, భవిష్యత్తుకు వెలుగు మార్గాన్ని చూపడంలో క్వాడ్ (ఇండియా, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్) దేశాల కూటమి ఆశా దీపంగా నిలుస్తుందని క్వాడ్ దేశాల అధినేతలు ప్రకటించారు. శుక్రవారం తొలిసారిగా క్వాడ్ వర్చువల్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యోషిహిడే సుగా శనివారం వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఈ మేరకు ఉమ్మడి ఆర్టికల్ రాశారు. క్వాడ్ సమిట్ సందర్భంగా 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి కోసం వ్యాక్సిన్ ఇనీషియేటివ్ ను ప్రకటించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. వ్యాక్సిన్ ఇనీషియేటివ్ కు అమెరికా, జపాన్ నిధులు సమకూరుస్తుందని, ఇండియా వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తుందని, ఆస్ట్రేలియా తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ దేశాల భాగస్వామ్యంతో ప్రతి కష్టకాలాన్నీ అధిగమిస్తూ వచ్చామన్నారు.

క్రైసిస్ నుంచి పుట్టింది..  

‘‘డిసెంబర్ 2004లో ఇండోనేసియా వద్ద కాంటినెంటల్ షెల్ఫ్ రెండు మీటర్లు ముందుకు జరిగింది. దీంతో చరిత్రలోనే భారీ సముద్రపు అలలు ఏర్పడ్డాయి. హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ చూడని విపత్తు వచ్చింది. వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కోసం ఇండో పసిఫిక్ రీజియన్ ఆర్తనాదాలు చేసింది. అప్పుడు మన నాలుగు దేశాలే కలిసికట్టుగా అభయ హస్తం అందించాయి. ఈ క్రైసిస్ నుంచే 2007లో క్వాడ్ దేశాల కూటమికి పునాది పడింది. 2017లో ఇది రీయాక్టివ్ అయింది” అని నేతలు తమ ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో అన్ని రకాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా సాగుతామని తెలిపారు. ఈ ప్రాంతం అందరిదని, ఇక్కడ అంతర్జాతీయ చట్టాల ప్రకారమే నడుచుకోవాలని, ఏ దేశం దౌర్జన్యమూ ఇకపై సాగదని పరోక్షంగా చైనాను మరోసారి హెచ్చరించారు.