ఇలా చేస్తే ఇండియా సూపర్‌‌ పవర్‌‌

ఇలా చేస్తే ఇండియా సూపర్‌‌ పవర్‌‌

మన దేశం అన్నింటిలో ముందుండడానికి ఆర్థికరంగ నిపుణులు10 మార్గా లు సూచిస్తు న్నారు. ప్రయాణ రంగంలాంటి వాటిని లాభసాటిగానడిపించడం, పెట్టు బడులను ఉపసంహరిం చడం, మరిన్ని సంస్కరణ-లు తేవడం, జీఎస్టీని మరిం త సులభంగా మార్చడం వంటి చర్యలుతీసుకుంటే అద్భుత ప్రగతి సాధ్యమవుతుందని చెబుతున్నారు.

నరేంద్ర మోడీ 2014లో భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, అల్పవృద్ధి, కోలుకోని ఆర్థిక వ్యవస్థ, ఐదు కోట్ల మందికి ఇంకా అందని కనీసం ఆదాయం.. వంటి సమస్యలు కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నాయి. పన్నులను మరింత సరళీకరించడం, డిమాండ్‌‌ను మరింత పెంచడం ద్వారా కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెడతారని తెలుస్తోంది.

ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ప్రణాళికలను ఆర్థిక మంత్రిత్వశాఖ, ఇతర విభాగాలు ఇది వరకే తయారు చేసి ఉంచాయి. మోడీ ప్రభుత్వానికి మొదటి చాలెంజ్‌‌ డిమాండ్‌‌ పునరుద్ధరించడమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వ్యక్తిగత పన్నులను మరింత తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజల జేబుల్లో మరింత డబ్బు ఉండేలా చేయాలన్నది మోడీ సర్కారు ఆలోచన. ఫలితంగా వాళ్లు మరింత ఖర్చు చేస్తారు కాబట్టి డిమాండ్‌‌ సహజంగానే పెరుగుతుంది. ఇలాంటి చర్యలతోపాటు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి మోడీ ప్రభుత్వంఈ 10 చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లాభార్జన

నష్టాల యూనిట్లను వదిలించుకోవడం మేలు
నష్టాల్లోని ప్రభుత్వరంగ యూనిట్లను అమ్మడానికి   వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. వ్యూహాత్మకం కాని పీఎస్‌‌యూలను అమ్మేయాలి. అమ్మకం కుదరనప్పుడు నష్టాల్లోని పీఎస్‌‌యూలను మూసేయాలి.  ఉద్యోగులకు  స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయాలి.

ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు ఆసరా ఇవ్వాలి
ఎన్‌‌బీఎఫ్‌‌సీలను ప్రభుత్వం ఆదుకోవాలి. గవర్నమెంటు బాండ్ల ద్వారా వీటి ఆస్తుల్లో కొన్నింటిని కొనాలి. ఈ బాండ్ల ద్వారా ఆయా సంస్థలు వనరులను పెంచుకుంటాయి.

బ్యాంకుల విలీనం కొనసాగాల్సిందే
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది వరకే చిన్న బ్యాంకుల విలీనంతో రెండు పెద్ద బ్యాంకులను సృష్టించింది.   దేశంలో  కేవలం ఐదు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఉండాలన్న ప్రతిపాదనను కొత్త ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలి. వాటికి తగినంత మూలధనం సర్దుబాటు చేయాలి.

ఐబీసీలో సవరణలు
మొండిబకాయిలు, నిరర్ధక ఆస్తుల సమస్య మరింత త్వరగా పరిష్కారమయ్యేలా ఇండియా దివాలా చట్టం (ఐబీసీ)లో సవరణలు చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్‌‌లో త్వరగా మార్పులు చేయాలి.

జీఎస్టీలో రెండు శ్లాబులు చాలు
18 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేయాలి. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను రెండుకు తగ్గిస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పన్నులను తగ్గించి, వసూళ్లను పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది.

బొగ్గు ఉత్పత్తి పెరిగేలా చూడాలి
బొగ్గు, ముడిఇనుము ఉత్పత్తి పెరగడానికి అవరోధంగా ఉన్న అడ్డంకులను తొలగించాలి. బొగ్గు సరఫరాలో ఇబ్బందుల వల్ల పరిశ్రమలు తిప్పలుపడుతున్నాయి కనుక బొగ్గు ఉత్పత్తి పెరగడానికి కృషి చేయాలి.  బొగ్గు సరఫరా పెరిగితే  197 గిగావాట్ల థర్మల్‌‌ పవర్‌‌ను ఉత్పత్తి చేయడం వీలవుతుంది.

నగరాలకి బాసటగా నిలవాలి
కొత్త నగరాలను నిర్మించాలి. పాతవాటికి మరిన్ని మెరుగులద్దాలి.  రియల్టీ రంగంలోని సమస్యలను పరిష్కరించాలి. పట్టణాల ఆధునీకరణకు ఉద్దేశించిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేలా స్మార్ట్‌‌ సిటీ మిషన్‌‌లో మార్పులు చేయాలి.

చైనా మార్కెట్కు వెళ్లాలి
దేశవ్యాప్తంగా మెగా ఇండస్ట్రియల్‌‌ జోన్స్‌‌ను నిర్మించాలి. కార్మిక సంస్కరణలను అమలు చేయాలి. భూసేకరణ చట్టాన్ని సవరించాలి. దీనివల్ల పోటీతత్వం పెరుగుతుంది. చైనాకు సాగు, ఫార్మా ఉత్పత్తులను ఎగుమతులను పెంచేలా అక్కడి మార్కెట్లోకి ప్రవేశించాలి. అంతర్జాతీయ కంపెనీలు తమ ప్లాంట్లను చైనా నుంచి మనదేశానికి మార్చేందుకు అనువైన వాతావరణం కల్పించాలి.

రైతు కీలకం
పంటలను అమ్ముకునేందుకు, గ్రీన్‌‌లైట్‌‌ జీఎం సాగుకు ఉన్న అడ్డంకులను తొలగించాలి. రైతు బతుకు బాగుపడేలా అనేక పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.