
కేంద్రం తన ఆధీనంలో ఉన్న దాదాపు 6 ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరునిష్ చావ్లా వెల్లడించారు. అయితే ఏఏ కంపెనీలు ప్రభుత్వ వాటాల విక్రయ పరిశీలనలో ఉన్నాయనే విషయాలను నేరుగా బయటపెట్టలేదు. కానీ ఐపీవో లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో తమ వాటాలను విక్రయించటం ద్వారా మోడీ సర్కార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.47వేల కోట్లు సంపాదించాలనే టార్గెట్ కి అనుగుణంగా ఇది జరుగుతోందని తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన కొంత ప్రక్రియ మెుదలైందని.. అయితే మార్కెట్లు ప్రస్తుతం స్టేబుల్ అయినందున చిన్న ఇన్వెస్టర్లకు లాభదాయకంగా వాటాల విక్రయాన్ని మార్చాలని చూస్తున్నట్లు చావ్లా చెప్పారు. వాస్తవంగా కంపెనీల జాబితా బయటకు రానప్పటికీ నిపుణుల అంచనాలను పరిశీలిస్తే.. ఓఎన్జీసీ, ఎన్హెచ్పీసీ తమ గ్రీన్ ఎనర్జీ వ్యాపారాలను అలాగే యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాటాల విక్రయంలో ఉండొచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఐడిబిఐ బ్యాంక్ వాటాల విక్రయ ప్రక్రియ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని చెప్పారు.
ఇకపై ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియను తాము వేగవంతం చేయాలని ప్లాన్ చేసినట్లు చావ్లా అన్నారు. మార్చి 31, 2026 నాటికి ఈ అసట్ మానిటైజేషన్ ప్రక్రియ కొలిక్కి వస్తుందని తమ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రక్రియలో ప్రభుత్వం డబ్బు సమకూర్చుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈసారి వాటాలు అమ్మే కంపెనీల లిస్టులో ఎల్ఐసీ కూడా ఉంటుందని తెలుస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.