
హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష చూపిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గం పుణె మెట్రో రైలుకు అనుమతిచ్చి, హైదరాబాద్ మెట్రో విస్తరణను ఎందుకు విస్మరించిందో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని గుర్తుచేశారు. దీనిపై ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ప్రతిసారి విన్న వించినా ఎందుకు పక్కన పెట్టారో తెలంగాణ ప్రజలకు కేంద్రం చెప్పాలన్నారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టుల విషయంలోనూ తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఏపీకి సెమీ కండక్టర్ ప్రాజెక్టు ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడం రాష్ట్రంపై మోదీ సర్కార్ చూపిస్తున్న వివక్షకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా...రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని మేడిపల్లి నిలదీశారు.