ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నం : కిషన్ రెడ్డి

ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నం : కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం సహా పలువురికి ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోడీ సర్కారు పనిచేస్తోందన్న ఆయన.. ఇందులో భాగంగా 10లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పిన ఆయన.. ఈ నెల 20న మరికొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తామని అన్నారు. 

ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షా 50వేల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. వెల్ నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ హాస్పిటళ్ల స్థానంలో ఇప్పుడు 22కు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2024లో  మరో 9 ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.