11 ఎకరాల్లో రూ.100 కోట్లతో సంత్​ రవిదాస్​ స్మారకం.. భూమిపూజ చేసిన ప్రధాని

11 ఎకరాల్లో రూ.100 కోట్లతో సంత్​ రవిదాస్​ స్మారకం.. భూమిపూజ చేసిన ప్రధాని

త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. సాగర్ జిల్లాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్‌ స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు మోదీ. 11 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సంత్‌ రవిదాస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

మధ్యప్రదేశ్‌లో రూ.4 వేల కోట్ల రోడ్ల విస్తరణ, రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రూ.2 వేల 475 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన కోట-బినా రైలు మార్గం డబ్లింగ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు రూ.16 వందల కోట్లతో మొరికొరి- విదిష-హినోతియలను కలిపే 4 లైన్ల రోడ్ ప్రాజెక్టుతోపాటు, హినోతియా- మెహ్లువాలను కలిపే రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

ఎవరీ సంత్​ రవిదాస్..?

నూతన సంత్​ రవిదాస్​ ఆలయాన్ని 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నగరా శైలిలో నిర్మించనున్నారు. ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. సంత్‌ రవిదాస్‌ గురించి ఇప్పటి ప్రజలకు తెలిసేలా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రవిదాస్‌ తత్వబోధనలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. గ్రంథాలయం, సమావేశ మందిరం, జల కుంద్‌, భక్తి నివాస్‌లను కూడా నిర్మించనున్నారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 

14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్తగా సంత్‌ రవిదాస్‌ ఖ్యాతి పొందారు. మధ్యయుగ కాలంలో భారతదేశంలో భక్తి ఉద్యమం బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో ప్రముఖుల్లో ఒకరిగా సంత్‌ రవిదాస్‌ కీర్తి గడించారు. ఇంతకుముందు.. సత్నా జిల్లాలోని మైహర్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం నిర్మించింది.