కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే.. కశ్మీర్​ దూరమైతది

కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే.. కశ్మీర్​ దూరమైతది
  • బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

సాసారాం/గయతాము అధికారంలోకి వస్తే జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్​ సహా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. నేరాలు, దోపిడీతోనే బీహార్​లో15 ఏళ్ల రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) హయాం సాగిందని విమర్శించారు. ‘‘ఈ రోజు రాష్ట్రాన్ని పీడిస్తున్న చాలా అనారోగ్యాలు.. 1990లలోని అరాచకం, చెడు పాలన ఫలితాలే. ఇప్పటి తరం ఒక విషయం తెలుసుకోవాలి. అప్పట్లో రాత్రిపూట రైళ్ల నుంచి దిగిన ప్రయాణికులు.. స్టేషన్లలోనే ఉండేవారు. ఎందుకంటే ఆ సమయంలో సంఘ వ్యతిరేక శక్తులు స్వేచ్ఛగా తిరిగేవి’’ అని ఆరోపించారు. సాసారాం, గయలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్, ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్​లకు నివాళులర్పించిన తర్వాత తన ప్రచారాన్ని ప్రారంభించారు.

అప్పట్లో కారు కొనాలన్నా భయమే

లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో హత్యలు, లూటీలు, దోపిడీలు జరిగాయని ప్రధాని మోడీ ఆరోపించారు. ‘‘సూర్యాస్తమయం తర్వాత జీవితం స్తంభించిపోయిన నాటి యుగాన్ని బీహార్ ప్రజలు మరిచిపోలేరు. ఇప్పుడు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, లైట్లు ఉన్నాయి. అతిపెద్ద విషయం ఏంటంటే.. సామాన్యుడు ఎలాంటి భయం లేకుండా బతకగలుగుతున్నాడు’’ అని చెప్పారు. ‘‘అప్పట్లో జనం సొంతంగా కారు కొనాలన్నా భయపడేవారు. ఓ పొలిటికల్ పార్టీ కన్ను తమపై పడుతుందేమోనని, తాము ఆస్తిపరులమని అనుకుంటారేమోనని జంకేవారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు..  కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే వాళ్లు” అని మోడీ ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన మహాకూటమి.. నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజలు పేదలుగానే ఉండాలని భావిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం.. 2004 నుంచి 2014 మధ్య బీహార్ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని చెప్పారు.

వాళ్లది బిమారు చరిత్ర

‘‘బీహార్​ను ‘బిమారు’గా మార్చిన చరిత్ర ఉన్న వారిని, అధికారంలో ఉన్నప్పుడు లూటీ చేసిన వారిని మరోసారి ఎన్నుకోకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పారు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను బిమారు అని పిలుస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉండటంవల్లే ఆ పేరు పెట్టారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్.. మళ్లీ అనారోగ్యాని(బీమార్)కు గురికాదని మోడీ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు ఉందని, లాంతర్ల కాలం ముగిసిందని చెప్పారు. ఆర్జేడీ ఎన్నికల గుర్తు ‘లాంతర్’ను ఉద్దేశిస్తూ మోడీ ఈ కామెంట్ చేశారు.

ఆర్టికల్ 370పై కుట్రలు

‘‘అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని వారు చెప్తున్నారు. వారి ధైర్యాన్ని చూడండి. వారు ఇంకా బీహార్ ప్రజల నుంచి ఓట్లు కోరే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశాన్ని కాపాడేందుకు బార్డర్​కు తమ బిడ్డలను పంపుతున్న బీహార్ మనోభావాలను అవమానించడం కాదా?” అని ప్రశ్నించారు. బార్డర్​లో చైనా దళాలతో గల్వాన్ వ్యాలీ జరిగిన గొడవను ప్రస్తావించారు. మువ్వన్నెల జెండా కోసం బీహార్​కు చెందిన బిడ్డలు ప్రాణాలు అర్పించారని, కానీ మదర్ ఇండియా తల దించుకోకుండా కాపాడారని అన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో కూడా బీహార్​కు చెందిన సోల్జర్లు అమరులయ్యారని చెప్పారు.

దళారులు, బ్రోకర్ల కోసమే వాళ్ల నిరసనలు

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలపై మోడీ మండిపడ్డారు. ఏ ఒక్క పార్టీ పేరెత్తకుండానే విమర్శలు చేశారు. ‘‘దళారులు, బ్రోకర్లను కాపాడేందుకే అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు కూడా వారు దళారులు, బ్రోకర్ల భాషను మాట్లాడారు’’ అని ఎగతాళి చేశారు.