కాశ్మీర్ రూపురేఖలు మార్చేది అక్కడి యువతే: మోడీ

కాశ్మీర్ రూపురేఖలు మార్చేది అక్కడి యువతే: మోడీ
  • త్వరలో చూడబోతున్నాం.. అక్కడి యువతే చేసి చూపిస్తుంది: మోడీ
  • వాళ్లే లీడర్లవుతారు.. వాళ్లే సీఎంలవుతారు.. ఆర్టికల్ 370 రద్దుతో నవ శకం షురూ
  • ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం.. అందరితో సమానంగా కాశ్మీరీలకు అవకాశాలు
  • హిందీ, తెలుగు, తమిళ్ సినిమా ఇండస్ట్రీకి  వెల్కమ్.. కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహిద్దాం 
  • జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.. త్వరలోనే మళ్లీ రాష్ట్రంగా మారుతుందని భరోసా

మార్గం చూపుదాం

భూతల స్వర్గం కాశ్మీర్​ వికాసానికి కలిసి నడుద్దామని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకు కాశ్మీరీ యువతే నాయకత్వం వహించాలన్నారు. ‘‘టూరిజం రంగంలో కాశ్మీర్‌ను అత్యున్నత స్థాయిలో నిలబెడదాం. ఒకప్పుడు ఇక్కడ అనేక సినిమా షూటింగ్​లు జరిగేవి. హిందీ ఫిల్మ్​ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీ, తమిళ్​ ఫిల్మ్​ ఇండస్ట్రీని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మళ్లీ సినిమా షూటింగ్​లు చేపట్టండి. కాశ్మీర్​ అందాలను ప్రపంచానికి చాటి చెప్పండి” అని కోరారు. ఇక్కడ ఎందరో కళాకారులు ఉన్నారని, ఎందరో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారికి మార్గం చూపాలని సూచించారు. కొత్త స్పోర్ట్స్‌ అకాడమీలు, స్టేడియాలు ఏర్పాటు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీఆర్టికల్​ 370 రద్దుతో వంచనలకు, అన్యాయాలకు కాలం చెల్లిందని, జమ్మూకాశ్మీర్​ అభివృద్ధికి దేశ ప్రజలందరూ కలిసి నడువాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నవ శకం ప్రారంభమైందని, సర్దార్​ వల్లభాయ్​ పటేల్, బాబా సాహెబ్​ అంబేడ్కర్​, శ్యామ ప్రసాద్​ ముఖర్జీ, అటల్​జీ వంటి కోట్లాది మంది దేశ భక్తుల కల నిజమైందని  అన్నారు. త్వరలోనే కాశ్మీర్​లో కమాల్​ జరుగబోతోందని, యువతే అది సాధించి చూపుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని చట్టాలన్నీ ఇక నుంచి కాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయన్నారు. ఆర్టికల్​ 370 రద్దు, జమ్మూకాశ్మీర్​ విభజన తర్వాత తొలిసారి గురువారం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆర్టికల్​ 370 వల్ల జమ్మూకాశ్మీర్​ ప్రజలు హక్కులు కోల్పోయారని, అన్యాయాలకు గురయ్యారని ప్రధాని అన్నారు. ఈ ఆర్టికల్‌ అమలును ఆయుధంగా చేసుకొని పాకిస్తాన్‌ టెర్రరిజాన్ని రెచ్చగొట్టిందని దుయ్యబట్టారు. కాశ్మీర్​లో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చేందుకు పిడికెడు మంది ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్​, లడఖ్​ ప్రజల సుఖదుఃఖాల్లో భాగం పంచుకొనేందుకు దేశం మొత్తం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఆ ఆర్టికల్​తో ఏం ఒరిగింది?

‘‘జమ్మూకాశ్మీర్​ ప్రజలకు ఆర్టికల్​ 370తో ఏం ఒరిగింది?  దాని వల్ల 60, 70 ఏండ్ల నుంచి ఎన్నో అన్యాయాలు ఎదుర్కొన్నారు. ఎన్నో హక్కులు కోల్పోయారు” అని మోడీ అన్నారు. ఈ ఆర్టికల్​ వల్ల కుటుంబ పాలన, టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, అవినీతిపరులు బాగుపడ్డారని, జనం మాత్రం అభివృద్ధికి దూరమయ్యారని తెలిపారు. ‘‘కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పార్లమెంట్​లో చట్టాలు చేయడం నిరంతర ప్రక్రియ. అలా చేసే చట్టాలు దేశంలోని ఒక రాష్ట్రానికి వర్తించవంటే ఎలా ఉంటుంది. అది ఊహకు కూడా అందదు. జమ్మూకాశ్మీర్​ విషయంలో ఇన్నాళ్లూ అదే జరిగింది” అని అన్నారు. ఆర్టికల్​ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్​ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని, టూరిజం హబ్​గా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.  ‘‘దేశంలోని ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉంది. మరి, జమ్మూకాశ్మీర్​లోని బిడ్డలు ఏ పాపం చేశారు. వారికి ఇన్నాళ్లూ ఎందుకు ఆ హక్కు దక్కలేదు? దేశంలో కార్మికులకు, రైతులకు, దళితులకు, మహిళలకు, మైనారిటీలకు హక్కులు ఉన్నాయి. మరి ఆ హక్కులు జమ్మూకాశ్మీర్​లో వారికి దక్కాయా? ఇక్కడి 1.5 కోట్ల మంది దేశంలోని ఇతర ప్రాంతాల్లోని వారికి సమానంగా అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయారు. దీనంతటికీ కారణం ఆర్టికల్​ 370… దాని అనుబంధంగా ఉన్న ఆర్టికల్​ 35ఏ.  వీటి రద్దుతో అసమానతలు దూరమయ్యాయి.  దేశమంతా ఒక్కటనే భావన ఏర్పడింది. ఒకటే ఇండియా.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైంది” అని పేర్కొన్నారు.  జమ్మూకాశ్మీర్‌‌‌‌ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుందన్నారు. ఇన్నేండ్ల స్వాతంత్ర్య దేశంలో జమ్మూకాశ్మీర్​ గురించి ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా? అని మోడీ ప్రశ్నించారు. అక్కడి అన్యాయాల గురించి కనీసం చర్చలైనా జరిపారా అని నిలదీశారు. జమ్మూకాశ్మీర్​ కోసం మూడు దశాబ్దాల్లో 42వేల మంది అమాయకులు ప్రాణాలు వదిలారని తెలిపారు. ఎంతో ఆలోచించి ఆర్టికల్​ 370ని రద్దు చేశామని చెప్పారు.

సోలో.. ఓ సంజీవని

ఆర్గానిక్​ ఉత్పత్తులకు పెట్టింది పేరు లడఖ్​ అని, ఆ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌‌‌‌కు అందజేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. లడఖ్​లో దొరికే సోలో అనే మూలిక ఆక్సిజన్‌‌‌‌ తక్కువగా ఉండే ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో  నివసించేవారికి సంజీవినిలా పనిచేస్తుందని తెలిపారు. ఇంతంటి ఔషధ మూలికలను ప్రపంచానికి పరిచయం చేయాల్సి అవసరం ఉందని చెప్పారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా లడఖ్​ అభివృద్ధి చెందుతుందని, సోలార్​ పవర్​ జనరేషన్​కు కూడా ఇది కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు.

త్వరలోనే రాష్ట్ర హోదా.. యువతే లీడర్స్​

వేర్పాటువాదుల నుంచి, టెర్రరిస్టుల నుంచి జమ్మూకాశ్మీర్​కు విముక్తి కల్పించాల్సిన తరుణం ఇదేనని మోడీ అన్నారు. కలలను సాకారం చేసుకోవాల్సి హక్కు అందరికీ ఉంటుందని, ఇక్కడి వాళ్లకు కూడా ఆ హక్కు ఉందని చెప్పారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్​, లడఖ్​ ప్రజలకు  ఫలాలు దక్కుతాయని తెలిపారు. ‘‘జమ్మూకాశ్మీర్​ ప్రజలకు భరోసా ఇస్తున్నాను.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. పరిస్థితులు సర్దుకున్నాక తిరిగి రాష్ట్ర హోదా దక్కుతుంది. ఇక్కడి యువత నుంచే లీడర్లు వస్తారు.. ఇక్కడి యువత నుంచే ముఖ్యమంత్రులు వస్తారు. కాశ్మీర్​లో కమాల్​ జరగబోతోంది. ఇన్నాళ్లూ కొన్ని కుటుంబాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేవి. ఇక ఆ పరిస్థితులు ఉండవు’’ అని అన్నారు.

ఎందరో వీరులు

దేశం కోసం ప్రాణాలర్పించిన జమ్మూకాశ్మీర్​ వీరులను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని అన్నారు. పూంఛ్​ జిల్లా నుంచి మౌల్వి గులాం, లడక్​ నుంచి వాంఛూ, రాజౌరి నుంచి కౌసర్​ ఇలా ఎందరో వీరులు దేశ సేవలో తరించారని కొనియాడారు. టెర్రరిస్టులపై పోరాడిన వారి స్ఫూర్తితో కశ్మీర్​ యువత ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్​లో త్వరలోనే శాంతిస్థాపన జరుగుతుందని, ఇక్కడి శాంతి ప్రక్రియ విశ్వశాంతికి కొత్త దారిని చూపుతుందని మోడీ ఆకాంక్షించారు. శాంతియుత కాశ్మీర్‌‌‌‌ కావాలని ప్రతి ఇండియన్​ కోరుకుంటున్నాడని చెప్పారు. ‘‘రండి.. అందరం కలిసి మన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుదాం. నయా భారత్​లో నయా జమ్మూకాశ్మీర్​, నయా లడఖ్​ నిర్మించుకుందాం. టెర్రరిస్టులు, వేర్పాటువాదుల నుంచి జమ్మూకాశ్మీర్​ను కాపాడుకుందాం. కొత్త స్వప్నం దిశగా పయనిద్దాం” అని పిలుపునిచ్చారు. త్వరలోనే ఈద్​ జరుపుకోబోతున్నామని,  జమ్మూకాశ్మీర్​లోనూ ప్రశాంత వాతావరణంలో ఈద్​ జరుగుతుందని, ఆయన ముబారక్​ చెప్పారు.

రాష్ట్రపతి పాలనతో మార్పు

జమ్మూకాశ్మీర్​లో రాష్ట్రపతి పాలనతో ఎంతో మార్పు వచ్చిందని, పరిస్థితులు మెరుగుపడ్డాయని, డెవలప్​మెంట్​ జరుగుతోందని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి పాలన కోసం తాము చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 5 నెలల క్రితం ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచినవాళ్లంతా బాగా పనిచేస్తు న్నారని, మహిళలకూ పోటీ చేసే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి వాళ్లు కృషి చేస్తున్నారని, ఇటీవల వారిని తాను కలిసినప్పుడు చాలా ఆనందం వేసిందన్నారు. ఆర్టికల్​ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్​ పంచాయతీల్లో కొత్త వ్యవస్థలో పనిచేసే అవకాశం యువ నేతలకు దక్కుతుందని, వాళ్లు కమాల్​ చేసి చూపిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

హద్దులు దాటొద్దు! పాకిస్తాన్​కు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​ను కేంద్రం యూటీలుగా విభజించిన నేపథ్యంలో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న పాకిస్తాన్ కు అమెరికా హద్దులు దాటొద్దని హెచ్చరించింది. ఇండియా నిర్ణయాన్ని తాము పరిశీలిస్తున్నామని, సంయమనం పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాక్​ ప్రతీకారేచ్ఛతో చొరబాట్లను ప్రేరేపించడం వంటివి చేయొద్దన్నారు. జమ్మూకాశ్మీర్​ను యూటీలుగా విభజించడంపై చట్టపరమైన అంశాలను తాము అధ్యయనం చేస్తున్నామని, ఆ ప్రాంతంలో అస్థిరత్వం ఏర్పడే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణాసియాలో సైనిక ఉద్రిక్తతలు రేగకుండా, ఘర్షణలు పెరగకుండా ఉండేందుకు జమ్మూకాశ్మీర్​ అంశంపై ఇండియా, పాకిస్తాన్​వెంటనే నేరుగా చర్చలు జరపాలని, అందుకు అమెరికా మద్దతిస్తుందని తెలిపారు.