వికసిత్ భారత్​కు పునాది 

వికసిత్ భారత్​కు పునాది 
  • వికసిత్ భారత్​కు పునాది 
  • యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత లక్ష్యంగా బడ్జెట్: మోదీ
  • క్యాపిటల్ ఎక్స్ పెండిచర్రూ. 11 లక్షల కోట్లకు పెంచడం చరిత్రాత్మకం 
  • 3 కోట్ల మహిళలను లక్షాధికారులు చేయాలన్న టార్గెట్ భేష్ అని ప్రశంసలు  

న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేసే దిశగా ఒక గ్యారంటీ బడ్జెట్ లా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించేలా ఉందన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ పై ఆయన టీవీ చానెల్ ద్వారా మాట్లాడారు. అభివృద్ధి చెందిన ఇండియా (వికసిత్ భారత్)కు నాలుగు మూలస్తంభాలు అయిన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు.

దేశ యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించేందుకు తోడ్పడుతుందన్నారు. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూనే క్యాపిటల్ ఎక్స్ పెండించర్ ను రూ. 11.11 లక్షల కోట్లకు పెంచడం చరిత్రాత్మక నిర్ణయమని ప్రధాని ప్రశంసించారు. దేశంలో లక్షలాది మంది కొత్త ఉపాధి అవకాశాలు దొరికేలా బడ్జెట్ కు రూపకల్పన జరిగిందన్నారు. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని.. ఇన్ క్లూసివ్, ఇన్నోవేటివ్ బడ్జెట్ అని చెప్పారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాలకు రూ. లక్ష కోట్లు కేటాయించడం, స్టార్టప్ లకు రిబేట్లు ప్రకటించడం కూడా చరిత్రాత్మక నిర్ణయమన్నారు.

పేదలకు మరో 2 కోట్ల ఇండ్లు.. 

పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం గ్రామాలు, పట్టణాల్లో 4 కోట్ల ఇండ్లు కట్టించామని, ఇప్పుడు మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. మహిళల్లో 2 కోట్ల మందిని లక్షాధికారులను చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నామని, ఇప్పుడు ఈ టార్గెట్ ను 3 కోట్లకు పెంచామన్నారు. పేదలకు ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడుతోందని, ఈ పథకాన్ని అంగన్ వాడీ, ఆశా వర్కర్లకూ విస్తరిస్తామన్నారు.

రూఫ్ టాప్ సోలార్ స్కీం ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత కరెంట్ అందడమే కాకుండా అదనపు కరెంట్ ను ప్రభుత్వానికి అమ్మడం ద్వారా ఏటా రూ. 15 వేల నుంచి 18 వేల ఆదాయం పొందేందుకు కూడా వీలవుతుందని ప్రధాని చెప్పారు. బడ్జెట్ లో ప్రకటించిన ట్యాక్స్ రెమిషన్ స్కీంతో మధ్యతరగతికి చెందిన కోటి మంది ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు. నానో డీఏపీ, మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ క్యాంపెయిన్ వంటివి రైతుల ఖర్చులు తగ్గేందుకు, ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడతాయన్నారు..