
- వేర్వేరు డీమాట్ ఖాతాలతో ప్రయత్నించడం బెటర్
- తొందరగా అప్లయ్ చేయడం,
- కట్ ఆఫ్ వద్ద బిడ్ వేయడం వంటి ఫాలో అవ్వాలి
- ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయితే గరిష్టంగా ఒక లాటే వస్తుంది
- ఈ ఏడాది ఐపీఓతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు
- ప్రైమరీ మార్కెట్ వైపు చూస్తున్న ఫారిన్ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: ప్రతీ వారం కొత్త కొత్త ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి. కానీ, అందరికి షేర్లు అలాట్ కావు. షేర్ల అలాట్‌మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే ఇన్వెస్టర్లు కొన్ని స్ట్రాటజీలను ఫాలో అవ్వాలి. కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరు డీమాట్ ఖాతాల ద్వారా ఒక్కో లాట్ అప్లై చేయడం ఉత్తమం. పాన్ నెంబర్‌ను బట్టి ప్రతి అప్లికేషన్‌ను సపరేట్ బిడ్‌గా పరిగణిస్తారు.
కట్ ఆఫ్ ధర వద్ద బిడ్ వేయడం, ఖచ్చితమైన వివరాలు (పాన్, డీమాట్, బ్యాంక్ అకౌంట్) ఇవ్వడం, తొందరగా అప్లై చేయడం వంటివి ఫాలో అయితే అలాట్‌మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. వీటితో పాటు షేర్ల అలాట్‌మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ప్రతి రిటైల్ ఇన్వెస్టర్‌కు కనీసం ఒక లాట్ కేటాయించాలన్న నిబంధనను సెబీ అమలు చేస్తోంది.
అలాగే, ఐపీఓలలో 35శాతం కోటాను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఉదాహరణకు, ఒక కంపెనీ 34.3 లక్షల షేర్లను ఆఫర్ చేస్తే, అందులో 12 లక్షల షేర్లు రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల(ఆర్‌ఐఐల) కు కేటాయిస్తారు. ఒక్క లాట్‌లో 60 షేర్లు ఉంటే, మొత్తం 20 వేల లాట్లు ఆర్‌ఐఐలకు లభిస్తాయి. అప్లికేషన్లు 20 వేల లాట్లకు తక్కువగా వచ్చినప్పుడు, ప్రతి అప్లికెంట్‌కు అప్లై చేసిన అన్ని లాట్లు అలాట్ అవుతాయి.
ఇంకా లాట్లు మిగిలితే ఇతర విభాగాలకు వెళ్తాయి. కొంచెం ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అయితే, అప్లికేషన్లు లాట్ల కంటే ఎక్కువగా వచ్చినా, అప్లికెంట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటే, ప్రతి అప్లికెంట్‌కు కనీసం ఒక లాట్ లభిస్తుంది. మిగిలిన లాట్లు లాటరీ ద్వారా పంపిణీ అవుతాయి. భారీగా ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అయ్యిందని అనుకుంటే, ఉదాహరణకు 20 వేల లాట్లు కేటాయిస్తే 6 లక్షల లాట్లకు అప్లికేషన్లు వచ్చినప్పుడు, 1:30 నిష్పత్తిలో కేటాయింపు జరుగుతుంది.
30 మందిలో ఒక్కరికి మాత్రమే లాట్ లభిస్తుంది. సెబీ రూల్స్ ప్రకారం, ప్రతి అప్లికెంట్‌కు సమాన అవకాశాలు ఉంటాయి. 20 వేల మంది ఒక్కో లాట్ మాత్రమే లాటరీ ద్వారా పొందుతారు. మిగిలిన 5.8 లక్షల మందికి షేర్లు లభించవు.
ఈ ఏడాది ఐపీఓల సందడి
ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ కళకళలాడింది. మార్కెట్‌లో అనిశ్చితి, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓల) ను విజయవంతంగా పూర్తి చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్ఈ) డేటా ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 26 నాటికి, 58 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు లిస్టయ్యాయి. తమ పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.77 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాయి.
ఈ మొత్తం సేకరణలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) వంటి కంపెనీల వాటానే దాదాపు 33శాతం ఉంటుంది. ఈ ఐపీఓలలో చాలావరకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 58.6శాతం కంపెనీల షేర్లు ప్రస్తుతం లిస్టింగ్ ధర కంటే ఎక్కువకు ట్రేడవుతున్నాయి.
అక్టోబర్‌లో టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వంటి పెద్ద కంపెనీల ఐపీఓలు కూడా సక్సెస్‌ఫుల్‌గా ముగిశాయి. ఎల్‌జీ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 11,607.01 కోట్లను సేకరించగా, కంపెనీ పబ్లిక్ ఐపీఓ 54 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. మరిన్ని కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
ఫారిన్ ఇన్వెస్టర్ల ఆసక్తి
ఈ ఏడాది సెప్టెంబర్ 26 నాటికి, ఈక్విటీ మార్కెట్‌లో నికరంగా రూ.1.91 లక్షల కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), ఐపీఓ మార్కెట్‌లో మాత్రం రూ.43,033 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం మీద, ఎఫ్‌పీఐలు ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. గ్లోబల్ ఒడిదుడుకుల మధ్య కూడా, ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ ఐపీఓలపై సానుకూలంగా ఉన్నారు.
ఫుల్ డిమాండ్
ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన 58 మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అవ్వడం విశేషం. ఆర్‌ఐఐ (రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్) విభాగంలో 53 ఐపీఓలు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. 58 ఐపీఓలలో 35 ఐపీఓలు 20 రెట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, ఎల్‌జీ అత్యధిక ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయిన ఐపీఓలుగా నిలిచాయి.