జిల్లా క్యాన్సర్ డే కేర్ సెంటర్లకు పెరుగుతున్న రోగులు..మూడు నెలల్లో 400 మందికి పైగా కీమోథెరపీ సెషన్స్

జిల్లా క్యాన్సర్ డే కేర్ సెంటర్లకు పెరుగుతున్న రోగులు..మూడు నెలల్లో 400 మందికి పైగా కీమోథెరపీ సెషన్స్
  • గతంలో కీమో కోసం హైదరాబాద్ ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే  హాస్పిటల్​కు వెళ్లాల్సిన పరిస్థితి
  • సెప్టెంబర్​లో అన్ని జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • సొంత జిల్లాల్లోనే సేవలు పొందుతున్న క్యాన్సర్ బాధితులు
  • ఖమ్మం జిల్లాలో అధికంగా 57, నల్గొండలో 47, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌లో 40 మందికి చికిత్స

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో.. క్యాన్సర్ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కీమోథెరపీ కోసం హైదరాబాద్ కు వచ్చి.. ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్​లో పడిగాపులు కాసే బాధ క్యాన్సర్ పేషంట్లకు తప్పింది. వారికి సొంత జిల్లాల్లోనే జిల్లా హాస్పిటల్స్ లో ఇప్పుడు కార్పొరేట్ స్థాయి కీమో వైద్యం అందుతున్నది. 

సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జిల్లా క్యాన్సర్ డే కేర్ సెంటర్లకు(డీసీసీ) పేషెంట్ల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. కేవలం మూడు నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 400 మందికి పైగా రోగులు తమ జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకున్నారు. దీంతో పేషంట్లకు అటు డబ్బు ఆదా అవ్వడంతో పాటు.. ఇటు ప్రయాణ నరకం నుంచి విముక్తి లభించినట్లయింది. కాగా, క్యాన్సర్ నిర్ధారణ, మొదటి ట్రీట్మెంట్ కోసం ఒక్కసారి ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్ కు వెళ్తే చాలు.. ఆ తర్వాత రోగుల కండీషన్ బట్టి జిల్లాల్లోనే కీమోథెరపీని అందిస్తున్నారు. 

ఈ సేవల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్‌‌‌‌‌‌‌‌ కు స్పెషల్ గా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే నుంచి పేషంట్ల లిస్ట్ రాగానే.. ఈ అధికారులే స్వయంగా బాధితులకు ఫోన్ చేసి స్థానిక హాస్పిటల్ కు పిలుస్తున్నారు. హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేకుండా.. పేషెంట్లకు ఉచితంగా కీమోథెరపీ అందిస్తున్నారు.

ఎక్కువగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో..

ఖమ్మం ప్రభత్వ మెడికల్ కాలేజీ.. కీమో సేవల్లో రాష్ట్రంలోనే టాప్‌‌‌‌‌‌‌‌ లో నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు అత్యధికంగా 57 మంది బాధితులు చికిత్స పొందారు. నల్గొండ జిల్లా డీసీసీలో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నెలలో అక్కడ జీరో కేసులు. కానీ డాక్టర్లు చేసిన అవగాహనో.. లేక పేషెంట్లకు కుదిరిన నమ్మకమో గానీ.. ఒక్కసారిగా పుంజుకొని అక్టోబర్, నవంబర్ నాటికి ఏకంగా 47 మందికి వైద్యం అందించి రెండో స్థానంలో నిలిచారు. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో 40 మంది పేషెంట్లు సేవలు పొందారు. ఆ తర్వాత వరుసగా భద్రాద్రి 25, కామారెడ్డి 19, సంగారెడ్డి 18 జిల్లాలు ఉన్నాయి.

కీమో ట్రీట్మెంట్ తీసుకొని బస్సెక్కితే నరకమే...

గతంలో క్యాన్సర్ పేషంట్ల పరిస్థితి దారుణంగా ఉండేది. కీమో కోసం జిల్లాల నుంచి హైదరాబాద్ రావాలంటే నరకం. కీమో మందు తీసుకున్నాక పేషెంట్లకు విపరీతమైన నీరసం, వాంతులు, తలతిరుగుడు ఉంటుంది. 

ఆ స్థితిలో బస్సెక్కి... వందల కిలోమీటర్లు ప్రయాణించి ఊరు చేరాలంటే ప్రాణం పోయేది. పోనీ ఇక్కడే ఉందామంటే రూం అద్దెలు కట్టలేరు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. పొద్దున టిఫిన్ చేసి జిల్లా హాస్పిటల్ కు పోతే.. గంటల్లో ట్రీట్మెంట్ తీసుకొని.. సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతున్నారు. అలాగే.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లోని ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్ కు రావాలంటే పేషెంట్‌‌‌‌‌‌‌‌ తో పాటు మరొకరు తోడు రావాలి. 

ఇద్దరికీ కలిపి బస్సు చార్జీలు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో భోజన ఖర్చులు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు అవుతాయి. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే చికిత్స అందడంతో వారి ఖర్చు మొత్తం తగ్గింది. మందులు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండటం విశేషం.

ఇంకా పుంజుకోవాలె...

కొన్ని జిల్లాల్లో ఇంకా ఈ స్కీమ్ జనంలోకి పోలేదు. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల జిల్లాల్లో పరిస్థితి మారాలి. డీసీసీ సెంటర్లు ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా.. ఆసిఫాబాద్ జిల్లాలో 1, ములుగు 2, జయశంకర్ భూపాలపల్లి 3.. ఇంకా కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 

యాదాద్రి, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోనూ సంఖ్య పెరగాల్సి ఉంది. ఎంఎన్‌‌‌‌‌‌‌‌జేలో రిజిస్టర్ అయిన ఆయా జిల్లాల పేషెంట్ల లిస్ట్ తెప్పించుకొని, వారికి ఫోన్ చేసి మా దగ్గరికే రండి అని భరోసా కల్పిస్తే ఇక్కడ కూడా నల్గొండ తరహా ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

కీమోనే కాదు.. మందులు కూడా

డీసీసీ సెంటర్లలో కీమోథెరపీ మాత్రమే కాదు.. క్యాన్సర్ చికిత్సకు అత్యవసరమైన 38 రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో రోజువారీ వేసుకునే టాబ్లెట్లు, క్యాప్సూల్స్ అనస్ట్రాజోల్, ఇమాటినిబ్, లెట్రోజోల్, టామోక్సిఫెన్, కెపాసిటాబిన్, దాసటినిబ్ వంటివి ఉండగా.. సెలైన్ ద్వారా ఎక్కించే ఖరీదైన కీమో ఇంజెక్షన్లలో సిస్‌‌‌‌‌‌‌‌ ప్లాటిన్, కార్బోప్లాటిన్, డాక్సెటాక్సెల్, పాక్లిటాక్సెల్, ఆక్సాలిప్లాటిన్, విన్‌‌‌‌‌‌‌‌ క్రిస్టిన్ వంటివి ఉన్నాయి. కీమో తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచే ఫిల్ గ్రాస్టిమ్ వంటి ఇంజెక్షన్లను కూడా ఈ సెంటర్లలో ఉచితంగానే రోగులకు అందిస్తున్నారు. 

టాప్  5 లో ఉన్న జిల్లాలు...  
ఖమ్మం                         57
నల్గొండ                       47
నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్            40
భద్రాద్రి కొత్తగూడెం    25
కామారెడ్డి                     19

శ్రద్ధ పెట్టాల్సిన జిల్లాలు..

ఆసిఫాబాద్                                  1
ములుగు                                      2
జయశంకర్ భూపాలపల్లి            3
యాదాద్రి భువనగిరి                   4
నిర్మల్                                         4
పెద్దపల్లి                                      4