ఖమ్మం రూరల్, వెలుగు: రెండో విడత ఎన్నికల వేళ గోళ్లపాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట పసుపు, కుంకుమతో క్షుద్ర పూజలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి తొండల రవికి కేటాయించిన కత్తెర గుర్తు ఉన్న నమూనా బ్యాలెట్ పేపర్లను పెట్టి క్షుద్రపూజలు చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. ఈ ఘటన వెనక ప్రత్యర్థులు ఉన్నారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కన్న తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉంచుకొని ఓటేసిన కొడుకు
దహెగాం, వెలుగు: కన్న తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలోనూ కొడుకు తనవంతు బాధ్యతగా ఓటేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన కాటారాపు కమల అనారోగ్యంతో ఆదివారం ఉదయం చనిపోయింది.
కాగా, ఆమె కొడుకు కాటారపు శ్రీనివాస్ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటేశాడు. విషయం తెలుసుకున్న పలువురు ఆయనను అభినందించారు.
