మోదీ టీ అమ్ముతున్నట్టుగా కాంగ్రెస్ ఏఐ వీడియో ..తీవ్రంగా మండిపడిన బీజేపీ

మోదీ టీ అమ్ముతున్నట్టుగా  కాంగ్రెస్ ఏఐ వీడియో ..తీవ్రంగా మండిపడిన బీజేపీ
  • గ్లోబల్ ఈవెంట్​లో ‘చాయ్.. చాయ్’ అని అంటున్నట్లు చిత్రీకరించిన నేతలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టీ అమ్ముతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన తాజా ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపింది. ఓ అంతర్జాతీయ సమిట్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తూ మోదీ ఓ చేతిలో చాయ్ కేటిల్, మరో చేతిలో గ్లాసులు పట్టుకుని.. ‘చాయ్.. చాయ్..’ అని అరుస్తున్నట్టుగా రూపొందించిన ఈ వీడియోను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

‘‘ఇప్పుడు, ఈ వీడియోను ఎవరు చేశారు?” అంటూ ఆ పోస్టులో ఆమె కామెంట్ చేశారు. లైట్ బ్లూ కోట్, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకుని ఉన్న మోదీ రెడ్ కార్పెట్ పై నడుస్తుండగా, వెనకవైపు వరుసగా భారత్ తోపాటు వివిధ దేశాల జాతీయ జెండాలు, కమలం పువ్వుతో కూడిన మరో జెండా ఉన్నట్టుగా కూడా చూపించారు.

 దీంతో దేశ ప్రధానిని గ్లోబల్ ఈవెంట్ లో చాయ్ అమ్ముతున్నట్టుగా చూపించడం ఏమిటంటూ కాంగ్రెస్ పై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాను చిన్నతనంలో కష్టపడి పనిచేశానని, టీ కూడా అమ్మిన్నట్టు ప్రధాని మోదీ గతంలో పలుసార్లు చెప్పుకున్నారు. అయితే, ఆ విషయంపై కాంగ్రెస్ మరోసారి మోదీని అవమానించిందని బీజేపీ విమర్శించింది. 

రాగిణి.. మరో మణిశంకర్ అయ్యర్.

మోదీ ఏఐ వీడియోపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్​లో మరో మణిశంకర్ అయ్యర్ తెరపైకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో మోదీ గెలవరని, ఆయన ప్రధాని అయ్యే చాన్సే లేదన్నారు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ మీటింగ్​లలో ఆయన టీ అమ్ముకోవచ్చని ఎద్దేవా చేశారు. దీంతో బీజేపీ దేశవ్యాప్తంగా ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లింది. 

మోదీని అవమానించినప్పుడల్లా కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నది ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి” అని విమర్శించారు. దేశాన్ని లూటీ చేసిన వారికి ఒక టీ సెల్లర్ ప్రధాని కావడం ఇష్టంలేకే ఇలా అవమానిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘నామ్ దార్ కాంగ్రెస్.. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన కామ్​దార్ పీఎంను ఎదుర్కొనే సత్తా లేక ఇలా హేళన చేస్తోంది. 

మోదీ చాయ్ వాలా బ్యాగ్రౌండ్​పై వారు ఇప్పటివరకూ 150 సార్లు అవమానించారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ మోదీ తల్లిని కూడా అవమానించింది. అందుకే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు” అని అన్నారు.